Search This Blog

Tuesday, May 13, 2025

Mothers Day: అమ్మను... చిన్నబుచ్చకండి!

Mothers Day: అమ్మను... చిన్నబుచ్చకండి!
అమ్మ  వంటలకు వంకలు పెట్టకండి. అమ్మ నమ్మకాల్ని వెక్కిరించకండి. అమ్మ అభిరుచుల్ని చిన్నచూపు చూడకండి. అమ్మ జ్ఞాపకాల్ని చులకన చేయకండి. అమ్మ ఆర్థిక నిర్ణయాల్ని  అపార్థం చేసుకోకండి.

అమ్మ  వంటలకు వంకలు పెట్టకండి. అమ్మ నమ్మకాల్ని వెక్కిరించకండి. అమ్మ అభిరుచుల్ని చిన్నచూపు చూడకండి. అమ్మ జ్ఞాపకాల్ని చులకన చేయకండి. అమ్మ ఆర్థిక నిర్ణయాల్ని  అపార్థం చేసుకోకండి. తెలిసి చేసినా, తెలియక చేసినా... తప్పు తప్పే. ఆ పొరపాటును సరిదిద్దుకోడానికి ‘మాతృ దినోత్సవం’ ఓ మంచి సందర్భం. 

కొడుకులూ కూతుళ్లూ పెరిగి పెద్దవుతున్న కొద్దీ, ఇంట్లో అమ్మ స్థానం చిన్నదైపోతుంది. ఎదుగుతున్న పిల్లలు ఆ తల్లిని పాత మోడల్‌ టీవీలానో, ఓల్డ్‌ జనరేషన్‌ కంప్యూటర్‌లానో... చూడటం ప్రారంభిస్తారు. అలానే ప్రవర్తిస్తారు. ఆఫీసులో పెద్ద బృందాన్ని సమర్థంగా నడిపే ఉద్యోగిని అయినా, గడపచాటు గృహిణి అయినా- పిల్లల దృష్టిలో పెద్ద తేడా ఉండదు, చిన్నచూపు తప్పదు. నిన్నమొన్నటి వరకూ వేలు పట్టుకుని నడిచినవాళ్లే... ప్రతిదానికీ వేలెత్తి చూపుతారు. కోరికోరి కథలు చెప్పించుకున్నవాళ్లే... నోరెత్తితేనే కసురుకుంటారు. గోరుముద్దలు పెట్టమని గోముగా అడిగినవాళ్లే... డైనింగ్‌ టేబులు సాక్షిగా తిరుగుబాటును ప్రకటిస్తారు. తన ఇంట్లో తానే పరాయి అయిపోతున్న భావన... ఆ సున్నిత మనస్కురాల్ని స్థిమితంగా ఉండనీయదు. లోలోపలే కుమిలిపోతుంది. పిల్లలే, ఆ తల్లి మనసును అర్థం చేసుకోవాలి. తమను తాము సరిదిద్దుకోవాలి.

అమ్మ వంట...

‘అబ్బా! ఎప్పుడూ పప్పుచారేనా?’

‘ఆ చెత్త ఇడ్లీలు నాకొద్దు?’

‘ఏంటి మమ్మీ! బిర్యానీ పులిహోరలా ఉంది!’

‘ఆ సీరియల్స్‌ ఆపేసి, నాలుగు ఫుడ్‌ ఛానల్స్‌ చూడొచ్చుగా. కొత్త వంటలు తెలుస్తాయి’

...ఇంత ఏకపక్షమైన దాడి రాజకీయాల్లోనూ ఉండదు. నాలుగు రుచులు తెలిసేసరికి నాలుకకు ఎక్కడలేని గర్వం వచ్చేస్తుంది. అప్పటి వరకూ లొట్టలేస్తూ తిన్న భోజనం, హఠాత్తుగా చేదెక్కిపోతుంది. అన్నం విషయంలో అమ్మను ముద్దాయిగా నిలబెట్టే పిల్లలకు ఓ సూటి ప్రశ్న... మీకు పాయసమంటే ఇష్టమని కనిపెట్టింది ఎవరు? అమ్మే! మీకు పెరుగన్నంలో మామిడిపండు నంజుకుని తినడం నేర్పింది ఎవరు? అమ్మే! మీకు ముద్ద్దపప్పూ ఆవకాయ కాంబినేషన్‌ పరిచయం చేసింది ఎవరు? అమ్మే! అదిగో చందమామ అంటూ ఊరించి ఒకసారీ... ఇదిగో బూచోడంటూ భయపెట్టి ఒకసారీ... అమ్మ ముద్ద, నాన్న ముద్ద, అత్తమ్మ ముద్ద అంటూ బంధాల్ని గుర్తుచేస్తూ ఒకసారీ... మీకే తెలియని మీ ఆకలిని గమనించుకుంటూ, ఓపిగ్గా బొజ్జ నింపింది ఎవరు? అమ్మ, అమ్మ, అమ్మే! 

ఆ అన్నపూర్ణమ్మపైనే ఇన్ని విమర్శలా?

మునుపటితో పోలిస్తే... అమ్మ వంటలో ఉప్పూకారం తగ్గిన మాట నిజమే. తానే ఉద్దేశపూర్వకంగా తగ్గించిందీ నిజమే. ఎదిగొస్తున్న పిల్లల్ని ఊబకాయం కమ్మేస్తుంటే, ఇంటిల్లిపాదినీ బీపీలూ షుగర్‌లూ భయపెడుతుంటే... ఏ తల్లి మనసైనా తల్లడిల్లకుండా ఉంటుందా? అందుకే, అంత కఠిన నిర్ణయం తీసుకుని ఉంటుంది. మీరంతా ఎగబడి రేటింగ్స్‌ ఇచ్చే రెస్టరంట్లలో ఎన్ని కిలోల పాచిన మాంసం వాడుతున్నారో, ఎన్నెన్ని ప్రమాదకరమైన రంగులు గుప్పిస్తున్నారో, ఎన్ని బొద్దింకలూ బల్లులూ బలైపోతున్నాయో మీకేం తెలుసు? ఆ తిండిని తినడమంటే అనారోగ్యాన్ని ముద్ద చేసుకుని నోట్లో పెట్టుకోవడమే. 

అమ్మ వంటతో ఎప్పుడూ ఆ సమస్య ఉండదు. ఆ చేతి చద్దన్నమైనా... అమృతమే. అమ్మ మెనూ... అచ్చంగా న్యూట్రిషనిస్ట్‌ ప్రిస్క్రిప్షన్‌. ఆమె చేతి గోంగూర పచ్చడి ఐరన్‌ క్యాప్సూల్‌. 
ఆమె వండిన బీట్‌రూట్‌ కర్రీ రక్తహీనతకు ఔషధం. ఆమె మక్కువతో కాచే మజ్జిగ పులుసు... పక్కా ప్రోబయోటిక్‌. పెరట్లో పండించే కొత్తిమీరా కరివేపాకూ వందశాతం ఆర్గానిక్‌. మీ ఆరోగ్యం అమ్మ బాధ్యత అయినప్పుడు, అమ్మకు సహకరించడం మీ బాధ్యత. ‘ఓ కిలో పెరగవూ, తగ్గవూ! 

నీ గ్లామర్‌ రహస్యం చెప్పొచ్చుగా’ అంటూ ఫ్రెండ్స్‌ ఆకాశానికెత్తేసినప్పుడు, మనసులోనే మురిసిపోవడం కాదు. అందరి ముందూ అమ్మకు థ్యాంక్స్‌ చెప్పాలి. దాంతోపాటే, 
సారీ కూడా! 

అమ్మ ప్రశ్న...

‘అమ్మా! నాకు తెలుసులే!’

‘మమ్మీ! నేను నీ సలహా అడిగానా?’ 

‘దీన్నే మోరల్‌ పోలీసింగ్‌ అంటారు’

...ఆపండి. ఆపండి. ప్రేమకొద్దీ ప్రశ్నించిన పాపానికి, కన్నతల్లిని నిర్దయగా నిలదీస్తారా? అయినా, మీకేం తెలుసో, ఎంత తెలుసో అమ్మకు ఎరుకే! ఇప్పుడైతే కొమ్ములొచ్చాయి కానీ, ఇంతకు ముందు ఎన్ని సలహాలు అడగలేదూ! బిడ్డ యోగక్షేమాలు తెలుసుకోవడం కూడా మోరల్‌ పోలీసింగే అయితే, అలానే అనుకోవచ్చు! పిల్లల విషయాల్లో జోక్యం చేసుకునే బాధ్యతా, పిల్లల్ని సూటిగా ప్రశ్నించే హక్కూ అమ్మకు ఉన్నాయి. మీరు కాలేజీకి వెళ్లకపోతే, ‘ఎందుకు వెళ్లలేదు?’ అని ప్రశ్నిస్తుంది. కారణం చెప్పండి! మీరు ఏ అర్ధరాత్రో ఇంటికొస్తే, ‘ఎందుకు ఆలస్యమైందీ?’ అని నిలదీస్తుంది. జవాబు ఇవ్వండి! మీరు గంటలకొద్దీ చాటింగ్‌ చేస్తుంటే, ‘ఎవరితో ఆ ముచ్చట్లు?’ అని సూటిగానే అడుగుతుంది. నిజం దాచొద్దు! ‘ఎంత 
అమ్మ అయితే మాత్రం, నా వ్యక్తిగత ప్రపంచంలోకి చొచ్చుకుని వచ్చేస్తుందా?’ అని ఆక్షేపించకండి. పద్దెనిమిదేళ్ల క్రితమో, ఇరవై ఏళ్ల క్రితమో... మీరూ తానూ వేరువేరు కాదు. మీరు అమ్మలో ఓ భాగం మాత్రమే. ఇప్పటికీ ఆమె అలానే భావిస్తుంది. పరీక్షల్లో మీకొచ్చిన పాస్‌ మార్కుల నుంచి ఫోన్లో మీరు సెట్‌ చేసుకున్న పాస్‌వర్డ్‌ వరకూ 
దేని గురించి అయినా నిలదీసి, నిజాలు రాబట్టుకోగల పరిపూర్ణ అధికారాన్ని అమ్మతనం ఆమెకు రాసిచ్చింది.

అమ్మ ఓ స్పీడ్‌ బ్రేకర్‌. పిల్లల వేగాన్ని నియంత్రిస్తుంది. అమ్మ ఓ హెచ్చరిక బోర్డు. ప్రమాదకరమైన మలుపుల్ని గుర్తు చేస్తుంది. అమ్మ నాణానికి బొరుసు. సమాజంలోని రెండో కోణాన్నీ పరిచయం చేస్తుంది. ఒక్కసారి బాల్యంలోకి వెళ్లండి. ‘ఇది నిప్పు. ముట్టుకుంటే చేయి కాలుతుంది’ అని అమ్మ చెప్పగానే గుడ్డిగా నమ్మేశారే. అప్పట్నుంచీ మహా జాగ్రత్తగా ఉన్నారే! ‘ఇది కారం. నోట్లో వేసుకుంటే మంట పుడుతుంది’ 

అని అమ్మ హెచ్చరించగానే, ఠక్కున గ్రహించేశారే. మరుక్షణం నుంచీ కారం డబ్బా వైపే వెళ్లలేదే! ఆ గురి ఇప్పుడేమైంది? అమ్మ ప్రశ్నిస్తే అంత చిరాకు ఎందుకు? అయినా అమ్మేం, నిరంకుశురాలు కాదు. ఏ విషయంలోనైనా తన అభిప్రాయం సరికాదనిపిస్తే, వివరంగా సర్దిచెప్పండి. తప్పక అర్థం చేసుకుంటుంది. అన్నింటా తన మాటే గెలవాలనే పంతం కంటే, ఏ విషయంలోనూ తన బిడ్డ ఓడిపోకూడదనే ఆరాటమే ఆమెలో ఎక్కువ. అవన్నీ ప్రశ్నలు కాదు, భయాలు. అమ్మ ప్రశ్నకు మీ దగ్గర జవాబు లేదంటే, మీలో జవాబుదారీతనం లోపించిందని అర్థం. వెంటనే ఆ లోపాన్ని సరిచేసుకోండి. నాన్న పెత్తనంలో నాశనమైపోయిన కొంపలు చాలానే ఉంటాయి. అమ్మ నాయకత్వంలో నష్టపోయిన కుటుంబాలు ఎక్కడా కనిపించవు. 

అమ్మ బడ్జెట్‌...

‘నువ్వు డబ్బు మనిషివి’

‘మా కంటే నీకు ఆస్తులే ఎక్కువ?’

‘నీకు బంగారం పిచ్చి పట్టుకుంది’ ...

...ఓ తల్లి గురించి అనుకోవాల్సిన మాటలేనా ఇవి. ఇంతేనా, తనని మీరు అర్థం చేసుకున్నది. అవును, అమ్మ విలాసాల్ని వ్యతిరేకిస్తుంది. దుబారాను ఖండిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో కించిత్‌ కఠినంగానే వ్యవహరిస్తుంది. ఇదంతా తన కోసం కాదు. తనేం నిర్మలా సీతారమణమ్మ కాదు. ఫారిన్‌లో చదువుకోలేదు. అరుంధతీరాయమ్మా కాదు. బ్యాంకింగ్‌ సూత్రాలు బట్టీపట్టలేదు. కానీ, ముందుజాగ్రత్తలో ఆ ఇద్దరికంటే ముందే ఉంటుంది. ఆ నైపుణ్యమే ఆమెను ఏది పండో, ఏది కాయో, ఏది పుచ్చో ఇట్టే కనిపెట్టగల ఫ్యామిలీ ఫండ్‌ మేనేజర్‌ను చేసింది. జీవితానుభవంతో పిల్లల పెంపకంతో పాటూ పైసల పెంపకం మీదా పట్టు సాధించిన కష్టజీవి ఆమె. అమ్మకు కోర్టులూ కేసులూ అంటే భయం. అందుకే, స్థిరాస్తుల జోలికి వెళ్లదు. స్టాక్‌ మార్కెట్‌ పట్ల అవగాహనా లేదు. దీంతో, షేర్ల వైపు కన్నెత్తి కూడా చూడదు. తన పోర్ట్‌ఫోలియోలో బంగారానికే పెద్దపీట. నాన్న ఖాతాలో బోనస్‌ పైసలు పడినప్పుడో, పల్లె నుంచి కౌలు డబ్బులు వచ్చినప్పుడో... పాత టీవీ మార్చేద్దామనో, కొత్త సోఫాసెట్ కొందామనో అందరూ పట్టుబట్టినా సరే. తాను మాత్రం గట్టిగా వ్యతిరేకిస్తుంది. ‘ఎంతోకొంత బంగారం కొనేద్దాం. పిల్లలు చేతికొస్తున్నారు...’ అంటూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటుంది. ఆ మొండి పట్టుదల కారణంగా పిల్లల వ్యతిరేకతనూ మూటగట్టుకుంటుంది. కానీ, అమ్మ దారే సరైందని ఏదో ఒకరోజు వాళ్లే అర్థం చేసుకుంటారు. ఎంత కొత్త టీవీ అయినా, కొనగానే విలువ తగ్గిపోతుంది. ఎంత నాణ్యమైన సోఫా అయినా కొన్నాళ్లకు రంగు వెలిసిపోతుంది. బంగారానికి 
ఆ పరిమితులు లేవు. వన్నె, విలువా... రెండూ తగ్గిపోవు. అమ్మ ముందుచూపులానే! బంగారం ధర లక్షకు చేరువైన సమయంలో సోషల్‌ మీడియాలో అనేక పాత ముచ్చట్లు వచ్చాయి. 

ఆ జ్ఞాపకాల్లో అమ్మే కథానాయిక. ‘‘పదేళ్ల క్రితం, మా అమ్మకు పుట్టింటి వాళ్లు పసుపుకుంకాల కింద ఇచ్చిన పొలానికి మంచి బేరం వచ్చింది. వెంటనే అమ్మేశాం. మొత్తం పదహారు లక్షలు చేతికొచ్చాయి. నాన్నకేమో ఖరీదైన లగ్జరీ కారు కొనాలని కోరిక. అమ్మకు ఆ ఆలోచన నచ్చలేదు. ‘కారులో ఏం ఉంటుందీ? పై నుంచి కింది వరకూ అంతా ఇనుమే! నాకైతే బంగారమే ఇష్టం. అలా అని, బంగారం లాంటి మిమ్మల్ని చిన్నబుచ్చలేను. ఓ పని చేద్దాం. ఎనిమిది లక్షలతో మన స్థాయికి తగిన కారు కొనుక్కుందాం. మిగతా ఎనిమిది లక్షలతో బంగారం కొనేద్దాం’ అంటూ విన్‌-విన్‌ ఫార్ములాను భర్త ముందు పెట్టింది. 

ఆ నిష్పత్తి ప్రకారంగానే కేటాయింపులు జరిగిపోతాయి. ఇప్పుడు, నాన్న పాత కారు లక్ష రూపాయలు కూడా పలకదు. అమ్మ బీరువాలోని బంగారం విలువ మాత్రం ముప్పై రెండు లక్షలకు చేరుకుంది. 

ఆ డబ్బు మా పాప మెడిసిన్‌ చదువుకు పనికొచ్చింది’ అంటూ ఫేస్‌బుక్‌లో గతాన్ని నెమరేసుకున్నాడు ఓ మిడిల్‌క్లాస్‌ పద్మనాభం.

అమ్మ డబ్బు విలువ తెలిసిన మనిషే కానీ, డబ్బు మనిషి కాదు. ఆమె పొదుపు పిల్లల కోసం. ఆమె మదుపు పిల్లల పిల్లల కోసం. సందేహం లేదు... అమ్మ మనసు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారమే! 

కాకపోతే, బంగారం విలువను అర్థం చేసుకున్నంత బాగా, అమ్మ విలువను గ్రహించలేక పోతున్నాం. 

అమ్మ సెంటిమెంట్లు...

‘శుక్రవారం షాపింగ్‌ చేయకూడదు’

‘శనివారం నాన్‌వెజ్‌ తినకూడదు’

‘ఏడాదికి ఒకసారైనా సకుటుంబంగా తిరుపతికి వెళ్లాలి’

‘ఇంటికి ఎవరొచ్చినా ఖాళీ కడుపుతో పంపకూడదు’

...అమ్మ సెంటిమెంట్లు బలమైనవీ, స్థిరమైనవీ. వాటి విషయంలో ఏ చిన్న తేడా వచ్చినా తట్టుకోలేదు. కాళికాంబ అయిపోతుంది. కాబట్టే, అంతటి నాన్న కూడా ఎప్పుడూ అడ్డు చెప్పడు. సమస్యంతా పిల్లలతోనే. ఎదిగేకొద్దీ, తమకే అన్నీ తెలుసనే అజ్ఞానం పెరిగేకొద్దీ ప్రశ్నించడం మొదలుపెడతారు. ధిక్కరించడం ఆరంభిస్తారు. దీంతో, ఆమె మనసు చివుక్కుమంటుంది. అమ్మ నమ్మకాల్ని తేలిగ్గా తీసిపారేయలేం. వాటి వెనుక బలమైన కారణాలు ఉంటాయి. దేశానికి ఉన్నట్టే, దేశంలోని ప్రతి గడపకూ ఓ రాజ్యాంగం ఉంటుంది. కుటుంబ విలువలూ, తరాల సంప్రదాయాలూ, ఏటా చేయాల్సిన నోములూ, ప్రత్యేక సందర్భాల్లో నిర్వహించాల్సిన వ్రతాలూ... అన్నీ ఆ అలిఖిత రాజ్యాంగంలో భాగాలే. వాటి అమలు బాధ్యత ట్రస్టీ హోదాలో అమ్మదే. నిజానికి, ఆ సెంటిమెంట్లను మూఢ నమ్మకాల గాటనా కట్టలేం. తరచి చూస్తే దాదాపుగా అన్నీ ఆరోగ్య సూత్రాలూ, నైతిక నియమాలే. నాన్‌వెజ్‌ అలవాటును పరిమితం చేసుకోవాలని డాక్టర్లు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. వారానికి ఒక్క రోజు... అమ్మ మాట ప్రకారమైతే శనివారం నాడు... చికెన్, మటన్‌లకు ‘నో’ చెబితే, జీర్ణ వ్యవస్థకు కొంత విశ్రాంతి ఇచ్చినట్టు ఉంటుంది. ప్రస్తుతం, ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఓ వ్యసనం స్థాయికి చేరిపోయింది. ముందుగా, శుక్రవారాన్ని ‘నో షాపింగ్‌ డే’గా ప్రకటించుకుంటే ఆ అలవాటుకు కొంతమేర అడ్డుకట్ట పడుతుంది. తీర్థయాత్రల పేరుతోనే కావచ్చు, కుటుంబ సభ్యులంతా కలిసి... ఏడాదికోసారి తిరుపతికో, యాదగిరిగుట్టకో వెళ్లిరావడం మంచిదేగా! మన అమ్మే కాదు, ఏ తల్లీ ఛాందసవాది కాదు. కూతురి భవిష్యత్తు బావుంటుందని అనిపిస్తే, బంధువర్గాన్ని ఎదిరించి అయినా, ఒంటరిగా విదేశాలకు పంపుతుంది. కొడుకు మెచ్చిన అమ్మాయి యోగ్యురాలనే నమ్మకం కుదిరితే, కట్టుబాట్లను ఛేదించి మరీ... ప్రేమ వివాహానికి పచ్చజెండా ఊపుతుంది. ఎదురింటి ఎలిజబెత్‌ టీచర్‌ పంపే క్రిస్మస్‌ కేకును ఎంత ఇష్టంగా తింటుందో, పక్కింటి ముంతాజ్‌ బేగం ఇచ్చే షీర్‌ కుర్మానూ అంతే మక్కువతో రుచి చూస్తుంది. భోజనం వేళకు పిల్లల స్నేహితులు ఎవరొచ్చినా... ఎంగిలిపడేదాకా వదిలిపెట్టదు. దేవుళ్లనూ, సంప్రదాయాల్నీ నమ్మడం, నమ్మకపోవడం మీ వ్యక్తిగతం. కానీ, బిడ్డగా అమ్మను నమ్మండి. అమ్మ సెంటిమెంట్లను గౌరవించండి.  

అమ్మ ఆనందాలు...

‘కాస్త తలుపేసుకుని పాడుకో మమ్మీ! 

జనాలు జడుసుకుంటారు.’

‘మీ ఫ్రెండ్స్‌కు పనీపాటా లేదా?

రోజూ కాల్స్‌ చేస్తారెందుకూ?’

‘మీ పుట్టింటి రికార్డులు వేయొద్దు ప్లీజ్‌’

...మీరేమో కూనిరాగాలు తీసుకోవచ్చు. ఫ్రెండ్స్‌తో తెల్లారే వరకూ చాటింగ్‌ చేసుకోవచ్చు. చిన్నప్పటి సాహసాల్ని గ్లోరిఫై చేసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేసుకోవచ్చు. అమ్మ విషయానికి వచ్చేసరికి మాత్రం... ఇంత వెటకారమా! తన వైపు నుంచీ ఒకసారి ఆలోచించండి. భర్త, పిల్లలే ఆమె సర్వస్వం. అనుబంధాల చుట్టూ అందమైన ప్రపంచాన్ని నిర్మించుకుని... చిన్నచిన్న ఆనందాలతో, చిట్టిపొట్టి అభిరుచులతో హాయిగా బతికేస్తోందా అల్పసంతోషి. ఆ కాస్త మనశ్శాంతిని కూడా లాగేసుకుంటారా? పొద్దున్నే ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి వేంకటేశ్వర సుప్రభాతాన్ని వింటూ ఇంటి పనులు చేసుకోవడం తనకు ఇష్టం కావచ్చు. ‘ఊరంతా వినిపించేలా, అంత వాల్యూమ్‌ ఎందుకు? చెవులు బాగానే పనిచేస్తున్నాయిగా...’ అని గొణుక్కుంటూ 
ఆ చిన్నపాటి అనుభూతినీ దూరం చేయకండి. ఏ శ్రావణంలోనో నలుగురు ముత్తయిదువలకు వాయనాలు ఇవ్వడానికి బయల్దేరుతుంటే.... ‘నీలాగే ఎవరికీ పనీపాటా ఉండదని అనుకుంటున్నావా? అసలే, ఆఫీˆసులకు వెళ్లే సమయం’ అంటూ మూర్ఖంగా అడ్డుకోకండి. సాయంత్రం పూట ఏ భక్తి ఛానలో చూస్తుంటే... 

‘మ్యాచ్‌ వస్తోంది...’ అంటూ రిమోట్‌ లాగేసుకోకండి. వెళ్లక వెళ్లక ఏ బాల్య స్నేహితురాలి ఇంటికో బయల్దేరితే, ‘ముఖ్యమైన కాల్స్‌ ఉన్నాయి’ అంటూ ఆటో బుక్‌ చేయడానికి విసుక్కోకండి. బట్టలు సర్దుతున్నప్పుడో, బీరువా ఖాళీ చేస్తున్నప్పుడో బయటపడిన కాలేజీ రోజుల నాటి ఫొటోల్ని ఉత్సాహంగా చూపించినప్పుడు, చెత్త కామెంట్లతో చిన్నబుచ్చకండి. అమ్మానాన్నలు చనిపోయినా, తోబుట్టువులు దూరమైపోయినా, సొంతూరితో సంబంధాలు దాదాపుగా తెగిపోయినా... ప్రతి ఆడపిల్లలోనూ పుట్టింటి మమకారం ఇంగువ కట్టిన గుడ్డలా ఇంకా మిగిలే ఉంటుంది. ఆ ఊరినో, అక్కడి మనుషుల్నో లోకువ చేసి మాట్లాడకండి! పెదాలు నవ్వినట్టు నటించినా, కళ్లు నిజంగానే ఏడ్చేస్తాయి. అమ్మను ప్రేమించడం అంటే... అభిరుచులూ, అభిప్రాయాలూ, జ్ఞాపకాలూ, నమ్మకాలతో సహా ప్రేమించడం!

అమ్మ నాయకత్వం!

చాలా కార్పొరేట్ సంస్థలు... పిల్లల తల్లుల్ని తీసుకోడానికి వెనుకంజ వేస్తాయి, జీతభత్యాల విషయంలో  బేరాలాడతాయి. నిజానికి, మాతృత్వం తర్వాతే ఆమె మనోబలం రెట్టింపు అవుతుంది. అమ్మను కనుక నియమించుకుంటే, ఓ సమర్థ నాయకురాల్ని పరివారంలోకి ఆహ్వానించినట్టే! బిడ్డను పెంచడం తెలిసిన వ్యక్తికి,  సంస్థను వృద్ధిలోకి తీసుకురావడమూ తెలిసే ఉంటుంది. 

నొప్పింపక...

లీడర్‌గా టీమ్‌లోని ప్రతి సభ్యుడూ ఆమెకు బిడ్డతో సమానమే. వాళ్లకేం కావాలో, తెలుసుకోగలదు. తనకేం కావాలో స్పష్టంగా చెప్పనూ గలదు.

సమయపాలన

పిల్లలకు బాక్సులు సర్దాలి, భర్తకు భోజనం వడ్డించాలి, తానూ పనికి బయల్దేరాలి. అయినా సరే,  ఏ వేళకు జరిగిపోవాల్సిన పని ఆ వేళకు జరిగిపోతుంది. ఎక్కడా తేడా రాదు. మాతృత్వ బాధ్యత ఆమెకు కాలంతో పోటీపడగల శక్తినిస్తుంది.

సహనంతో...

బిడ్డకు గోరుముద్దలు తినిపించడానికైనా, జోలపాడి నిద్రపుచ్చడానికైనా భూదేవి అంత సహనం కావాలి. అమ్మతనంతోపాటే ఆ నైపుణ్యమూ ఆమె సొంతం అవుతుంది. 
విధి నిర్వహణకూ అది పనికొస్తుంది.

దీర్ఘకాలిక ప్రణాళిక

బిడ్డ కడుపున పడగానే... అమ్మ మనసులో పాతికేళ్ల ప్రణాళిక సిద్ధమైపోతుంది. బడ్జెట్ పద్దులూ తయారైపోతాయి. ప్లానింగ్‌ విషయంలో అమ్మ ప్లానింగ్‌ కమిషన్‌కూ పాఠాలు చెప్పగలదు.

తిరుగులేని తీర్పరితనం

కొడుకూ, కూతురూ మిఠాయి కోసమో, పుస్తకం కోసమో వాదులాడుకున్నప్పుడు... మంచిచెడులు బేరీజు వేసి, న్యాయాన్యాయాలను సమీక్షించి  సరైన తీర్పు ఇవ్వడంలో 
ఆమె చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ది ఫ్యామిలీ!  

Tags :

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top