Search This Blog

Wednesday, February 10, 2016

విద్యా విలీనం

విద్యాశాఖ పరిధిలోకి అన్ని రకాల విద్యా సంస్థలు 
విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి 
ఉద్యోగ పోటీ పరీక్షలకు విద్యార్థులను తీర్చిదిద్దాలి 
కొత్త విద్యా విధానం రూపకల్పనకు ముఖ్యమంత్రి ఆదేశం 
విద్యాశాఖపై సమీక్షించిన కేసీఆర్‌ 
ఈనాడు - హైదరాబాద్‌ 
పాఠశాలలు, కళాశాలలు, వృత్తి విద్యాసంస్థలు, స్టడీ సర్కిళ్లు... ఇలా వేర్వేరు విద్యాసంస్థలు వేర్వేరు శాఖల నిర్వహణలో ఉన్నాయి. వాటన్నింటినీ విద్యాశాఖ గొడుకు కిందికే తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, రాజీవ్‌శర్మ తదితరులతో మంగళవారం విద్యాశాఖపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర శాఖల నిధులతో నడిచే విద్యాసంస్థలు, సొసైటీలు, స్టడీ సర్కిళ్లు ఉన్నాయి. కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఐటీఐలు నడుస్తున్నాయి. ఇలా ఎవరికి వారుగా విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారు. వైద్య విద్య, వ్యవసాయం, ఫార్మా మినహా మిగతా అన్ని రకాల, అన్ని స్థాయుల విద్యా సంస్థలను విద్యాశాఖ గొడుగు కిందికే తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. బడ్జెట్‌ రూపకల్పన సందర్భంగా వివిధ శాఖల గురించి కూలంకషంగా అధ్యయనం చేస్తున్న ప్రభుత్వం... అందులో భాగంగా విద్యాశాఖపై దృష్టి పెట్టినప్పుడు అనేక అంశాలు సీఎం దృష్టికి వచ్చాయి. విద్యా వ్యవస్థ అంతా అడ్డదిడ్డంగా...అస్తవ్యస్తంగా ఉందని తేటతెల్లం కావడంతో మొత్తంగా ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్న నిర్ణయానికి ముఖ్యమంత్రి వచ్చారు. ఎవరికి వారుగా విద్యాసంస్థలను నిర్వహించడం వల్ల సమగ్రత లోపించింది. దీనిపై సమగ్ర అధ్యయనం చేసి, కొత్త విద్యా విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి విధాన రూపకల్పన జరగాలని చెప్పారు. విద్యార్థులకు అవసరమైన విద్య, ఉద్యోగావకాశాలు పెంచే శిక్షణ అందటం లేదని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. రాష్ట్రంలో, దేశంలో ఏయే ఉద్యోగావకాశాలున్నాయో తెలుసుకొని వాటికనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దే పని కూడా జరగడం లేదని ముఖ్యమంత్రి అభిప్రాయబడ్డారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌, జాతీయస్థాయిలో యూపీఎస్‌సీ ద్వారా నిర్వహిస్తున్న ఉద్యోగ పరీక్షల గురించి మాత్రమే అటు విద్యార్థులు, ఇటు ప్రభుత్వం దృష్టిపెడుతోంది. ఇవే కాకుండా ఇంకా దేశవ్యాప్తంగా ఉద్యోగావకాశాలున్న అనేక పోటీ పరీక్షలున్నాయి. రక్షణ, రైల్వే, బ్యాంకింగ్‌ తదితర రంగాల్లో ఉద్యోగావకాశాలున్నా...వాటికి సంబంధించిన సమాచారం విద్యార్థులకు అందటం లేదు. విద్యార్థులను ఆ పరీక్షల కోసం సిద్ధంచేయడం లేదు. వీటికి తోడుగా దేశవ్యాప్తంగా ఉద్యోగావకాశాలున్న రంగాలు అనేకం పెరుగుతున్నాయి. వీటికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావిస్తున్నారు. ప్రస్తుతమున్న విద్యా విధానం వల్ల విద్యార్థులు నిరుద్యోగులుగా మారుతున్నారు తప్ప ఉద్యోగావకాశాలు పొందలేకపోతున్నారని ఆయన అన్నారు. అవసరమ్యే విద్య అందించే విధంగా తెలంగాణ రాష్ట్ర విధానం ఉండాలని సూచించారు.
ఉద్యోగ అంచనాలుండాలి: అవసరాలకు తగిన విధంగా విద్యార్థులు కోర్సులను ఎంపిక చేసుకోవడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో వైద్యులు ఎంత మంది కావాలి? ఇంజినీర్లు ఎందరు కావాలి? ఇంకా ఏయే ఉద్యోగాలకు ఎంత మంది కావాలి? అనే అంచనాలు విద్యాశాఖకు ఉండాలి. దానివల్ల విద్యార్థులను ఆయా ఉద్యోగాలకు సిద్ధంచేసే అవకాశం ఉంటుందని సీఎం అభిప్రాయబడ్డారు.
ఆదర్శ పాఠశాలలపై నిర్ణయం తీసుకోవాలి: ఆదర్శ పాఠశాలల పథకం చాలా చోట్ల అమలు కావడంలేదు. కొన్ని రాష్ట్రాలు ఆదర్శ పాఠశాలల ప్రతిపాదనలను తిరస్కరించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వాటి ఏర్పాటుపై ఓ నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావిస్తున్నారు.

CLICK BELOW TO JOIN IN OUR TGARIEA

MOTIVATIONAL VIDEOS

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top