Good Parenting: ఈ డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్లు మన జీవితంలో ఒక భాగమైపోయాయి. పిల్లలు కూడా చిన్నతనంలోనే మొబైల్ ఫోన్లకు బాగా ఆకర్షితులవుతున్నారు. పిల్లలకు మొబైల్ చూపడం శారీరక, మానసిక, సామాజిక అభివృద్ధిపై ప్రభావం చూపుతుందని మానసిక వైద్యులు హెచ్చరిస్తున్నారు. పిల్లలకు మొబైల్ ఫోన్ చూపడం వల్ల కలిగే లాభ నష్టాలూ అలాగే వాటిని నియంత్రించే మార్గాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పిల్లలకు మొబైల్ ఇవ్వడం వల్ల లాభాలు:
మొబైల్ ఫోన్లు విద్యా పరమైన ప్రయోజనాలు అందించడమే కాకుండా పిల్లలకు విద్యా యాప్‌లు, ఆన్లైన్ కోర్స్‌లు, కొత్త నైపుణ్యాలు నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఉదాహరణకు భాషా అభ్యాసం, యాప్‌లు పిల్లలకు ఎంతో సహాయపడతాయి. అంతే కాకుండా కొన్ని గేమ్‌లు పిల్లలలో సృజనాత్మకతను, సమస్యా పరిష్కార నైపుణ్యాలను పెంపొందిస్తాయి. ఈ ఆధునిక సాంకేతికతను సరైన మార్గంలో ఉపయోగించినట్లైతే పిల్లల మేధస్సుకు, అభివృద్ధికి ఉపయోగపడతాయని నిపుణుల సలహా.
నష్టాలు:
మొబైల్ ఫోన్ అతిగా ఉపయోగించడం వల్ల పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఎక్కువ సమయం స్క్రీన్ ముందు గడపడం వల్ల కంటి సమస్య, నిద్రలేమి, ఒత్తిడి వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. సామజిక మాధ్యమాలు, గేమ్ లు పిల్లల దృష్టిని తేలికగా ఆకర్షించి వారి చదువు, ఇతర కార్యకలాపాలపై దృష్టి కోల్పోయేలా చేస్తాయి. అధిక మొబైల్ ఫోన్ ఉపయోగం పిల్లల సామజిక నైపుణ్యాన్ని దెబ్బతీసి స్నేహితులతో, కుటుంబ సభ్యులతో గడిపే సమయాన్ని తగ్గిస్తుందని అధ్యయన కారులు హెచ్చరిస్తున్నారు.
నియంత్రణకు సూచనలు:
పిల్లలు మొబైల్ ఫోన్ వాడకం తగ్గించేందుకు తల్లిదండ్రులు తీసుకోవలసిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం.
పిల్లలు మొబైల్ ఫోన్ ఉపయోగించడం కోసం తల్లిదండ్రులు రోజువారీ సమయ పరిమితిని నిర్ణయించాలి. ఉదాహరణకు రోజుకు 1-2 గంటలు స్క్రీన్ టైం ఉండేలా చూసుకోవాలి.
పిల్లలలు విద్యాపరమైన కంటెంట్ ను మాత్రమే చూసేలా చేయాలి.
తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి ఆటలు ఆడటం, బయటి కార్యకలాపాలలో పాల్గొనడం ద్వారా వారి దృష్టిని మొబైల్ ఫోన్ నుంచి మళ్లించాలి.
పిల్లలు రాత్రి సమయంలో మొబైల్ వాడడం పూర్తిగా నిషేధించడం మంచిది, ఎందుకంటే ఇది నిద్ర నాణ్యతను ప్రభావితం చేసి నిద్రలేమికి దారి తీస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
మొబైల్ ఫోన్లు పిల్లలకు విద్య, వినోదాన్ని అందించగలవు, కానీ వాటి ఉపయోగం సమతుల్యంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల మొబైల్ ఉపయోగాన్ని పర్యవేక్షించడం ద్వారా వారి ఆరోగ్యాన్నీ, అభివృద్ధిని కాపాడవచ్చు. సరైన మార్గదర్శనంతో, మొబైల్ ఫోన్లు పిల్లలకు ఉపయోగకరమైన సాధనంగా మారతాయి. అయితే, వాటి దుర్వినియోగం వారి భవిష్యత్తును ప్రమాదంలోకి పడేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.