భార్యాభర్తలు ఒకేచోట పనిచేసేలా వెసులుబాటు!
హైదరాబాద్: భార్యాభర్తలైన ప్రభుత్వ ఉద్యోగులు ఒకేచోట పనిచేసేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో వెసులుబాటు కల్పించనుంది. ఈ మేరకు ఉద్యోగుల బదిలీల విషయమై ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం తీసుకుంది. కమల్‌నాథన్ కమిటీతో సంబంధంలేకుండా ఉద్యోగుల సాధారణ బదిలీలు చేపట్టాలని ఉద్యోగ సంఘాలు ఎప్పట్నుంచో కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో భార్యాభర్తల విషయమై ప్రభుత్వం మొదట నిర్ణయం తీసుకుంది. ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులై వేర్వేరు చోట్ల పనిచేస్తున్నట్లయితే ఒకేచోట పనిచేసేలా వీలు కల్పించేలా బదిలీలు చేపడతారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులు జారీచేయనున్నట్లు సమాచారం.