Search This Blog

Monday, February 8, 2016

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని కాదని ప్రభుత్వ ఉద్యోగం కోసం


చిన్ననాటి నుంచి సాధారణ విద్యార్థిని.. ఇంజినీరింగ్ పూర్తి చేసేనాటికే చేతికొచ్చిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదులుకుని మరి తన లక్ష్యసాధన కోసం ముందుకు సాగింది. తండ్రి మరణంతో కుంగిపోకుండా తల్లినే రోల్‌మోడల్‌గా చేసుకుని ఇంటో ఒకరు పోలీస్ ఉద్యోగంలో ఉండాలనే తన తండ్రి కోరిక నెరవేర్చింది. తొలి పోస్టింగ్ తన సొంత జిల్లా నల్లగొండ ఎస్బీ డీఎస్పీగా నియాకమయ్యారు. చేపూరి శృతకీర్తి.

మిర్యాలగూడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చేపూరి రామాచారి, స్వరూపారాణి దంపతుల చిన్న బిడ్డ చేపూరి శృతకీర్తి. పుట్టింది జిల్లాలో అయినా.. చదువు పూర్తిగా హైదరాబాద్‌లో కొనసాగింది. సెయింట్ ఆంథోనీ పాఠశాలలో పదో తరగతి వరకు పూర్తి చేసి.. శ్రీ చైతన్యలో ఇంటర్మీడియట్ చదివారు. శృతకీర్తి ఇంటర్‌లో ఉన్నప్పుడే తండ్రి రామాచారి మృతిచెందడంతో ఆమెతోపాటు అన్నయ్య హరీశ్(సాఫ్ట్‌వేర్ ఇంజినీర్), అక్క దీప్తి (దంత వైద్యురాలు)ల బాగోగులు, చదువు భారం పూర్తిగా తల్లి స్వరూపారాణి చూసుకున్నారు. ఇంటర్మీడియట్ తర్వాత సీవీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో బీటెక్ ఈసీఈ విభాగంలో పూర్తి చేశారు. సాంకేతిక విద్యనభ్యసించినా.. ఆ తర్వాత సివిల్స్ కోసం చదివి ఆ ప్రయత్నంలో ఉండగానే గ్రూప్-1 విజేతగా నిలిచారు. చిన్న నాటి నుంచి చదువులో సాధారణ ఫలితాలు మాత్రమే సాధించినా.. ఏ ఒక్కసారీ కాంపిటీటివ్ పరీక్షలను ఎదుర్కోకపోయినా.. తొలి ప్రయత్నంలోనే గెలుపు సాధించారు. 

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదులుకుని..


శృతకీర్తి బీటెక్ ఫైనలియర్‌లో ఉన్నప్పుడు జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలోనే పుణెకు చెందిన.. సింటెన్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజినీర్‌గా ఉద్యోగం వచ్చింది. అయినా.. ప్రభుత్వ సర్వీసులో పని చేయాలనే కోరిక మేరకు ఆ అవకాశాన్ని కాదనుకున్నారు. బీటెక్ పూర్తయిన వెంటనే అన్నయ్య, అమ్మ ఇచ్చిన ప్రోత్సాహంతో.. సివిల్స్ కోసం ప్రిపరేషన్ ప్రారంభించారు. మూడు నెలల పాటు హైదరాబాద్‌లోనే శిక్షణ తీసుకున్నారు. సివిల్స్ టార్గెట్ చేసిన వారిలో ఎక్కువ మంది ఢిల్లీలో శిక్షణకు వెళ్తున్నా.. కుటుంబాన్ని విడిచి ఉండలేక హైదరాబాద్‌లోనే సాధన ప్రారంభించారు. 2008లో బీటెక్ పూర్తయిన వెంటనే ప్రిపరేషన్ ప్రారంభించగా.. సివిల్స్ పరీక్ష రాయకముందే గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ అయింది. దీంతో దానికి దరఖాస్తు చేయడం.. 2009లో ప్రిలిమ్స్, ఆ తర్వాతి ఏడాది మెయిన్స్.. 2011లో ఇంటర్వూ, 2012లో తుది జాబితా ప్రకటన.. ఇలా వరుసగా జరిగిపోయాయి. 

కొత్త సబ్జెక్టులు అయినా కష్టం అనుకోకుండా చదివి..


ఇంజినీరింగ్‌లో పూర్తిగా సాంకేతిక విద్యనే అభ్యసించిన శృతకీర్తి.. సివిల్స్ కోసం జనరల్ స్టడీస్‌తోపాటు ఆప్షనల్స్‌గా ఎంచుకున్న సబ్జెక్టులు పూర్తిగా కొత్తవే. అయినా.. ఎన్నడూ కష్టం అనుకోకుండా ఇష్టంతోనే చదివారు. ఆంత్రోపాలజీతోపాటు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లు ఆప్షనల్స్‌గా ఎంచుకుని ప్రిపరేషన్ ప్రారంభించి.. మూడు నెలలు మాత్రమే శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత రోజూ తన ఇంటికి దగ్గర్లోనే ఉండే చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి వెళ్లి చదువుకునే వారు. ఇల్లు పక్కనే ఉన్నా.. సమయం వృథా కాకుండా ఉండడానికి మధ్యాహ్న భోజనం సైతం వెంట తెచ్చుకుని ప్రిపరేషన్ కొనసాగించారు. లైబ్రరీకి ఆలస్యంగా వస్తే కుర్చీ దొరకదనే కారణంతో.. ఉదయం 8 గంటల కంటే ముందే అక్కడ క్యూ కట్టేవారు. సాయంత్రం ఆరున్నర వరకు కేవలం అరగంట విరామం మాత్రమే తీసుకుని ఇక్కడే చదువు పూర్తి చేసే వారు. ఇంటికి వెళ్లిన తర్వాత మళ్లీ ఎప్పుడూ పుస్తకం పట్టుకోకుండా సాధారణంగానే గడిచేది. పూర్తిగా కొత్త సబ్జెక్టులు చదువుతున్నా.. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కోరికతో ఇష్టంగా చదువుతుండడంతో.. నిర్విరామంగా చదివినా అలసిపోయనట్లు భావించే వారు కాదు. 

అమ్మను తన రోల్ మోడల్‌గా ఇంటర్వ్యూలో మెప్పించి..


ప్రతిరోజూ పత్రికల్లో వార్తా కథనాలను ఆసాంతం పరిశీలించి.. సొంతంగా నోట్స్ తయారు చేసుకోవడంతోపాటు.. ఎక్కువ సంఖ్యలో పుస్తకాల జోలికి వెళ్లకుండా.. ఉన్నవాటినే ఎక్కువసార్లు చదివేవారు. అలా.. సివిల్స్ కోసం చదివిన ప్రిపరేషన్‌తోనే గ్రూప్-1 ప్రిలిమ్స్ సులభంగా సాధించిన శృతకీర్తి.. తర్వాత గ్రూప్-1 మెయిన్స్ కోసం ఒక సబ్జెక్టు విషయంలో మాత్రమే కోచింగ్ తీసుకున్నారు. చుట్టూ ఉన్న వాళ్లను చూసి నాకంటే ఎక్కువ చదువుతున్నారని భయపడ్డా.. ఏనాడూ తన చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. తొలి ప్రయత్నంలోనే కాదు.. మలి ప్రయత్నంలోనూ రాకున్నా ఏంకాదు.. నువ్ ప్రయత్నించు అన్నయ్య మాటలే తనను విజేతగా నిలిపాయని చెప్తారామె. మెయిన్స్‌లోనూ మంచి మార్కులు సాధించిన తర్వాత జరిగిన ఇంటర్వ్యూలో.. నాన్న మరణం తర్వాత ముగ్గురు పిల్లలనూ జాగ్రత్తగా, బాధ్యతగా పెంచిన తన తల్లినే తన రోల్ మోడల్‌గా వివరించి.. ఇంటర్యూ బోర్డును తన వివరణతో మెప్పించి.. తుది జాబితాలో చోటు సంపాధించుకుని గ్రూప్-1లో డీఎస్పీగా ఉద్యోగం సాధించారు. 

కఠినమైన శిక్షణ పూర్తి చేసుకుని డీఎస్పీగా ప్రజా సేవలో..

 
చిన్నప్పటి నుంచీ ఆట పాటల్లోనూ అంత ఉత్సాహంగా పాల్గొనని శృతకీర్తి.. అప్పుడప్పుడూ యోగా మాత్రం చేసేవారు. డీఎస్పీ ఉద్యోగం కోసం ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ (అప్పా)తోపాటు గ్రేహౌండ్స్ శిక్షణలోనూ కఠోరమైన పరిస్థితుల్లో నేర్చుకోవాల్సి వచ్చింది. అయినా.. ఎక్కడా వెనక్కి తగ్గకుండా.. బరువులు మోస్తూ కొండలు ఎక్కి మరీ గ్రేహౌండ్స్ శిక్షణను పూర్తి చేసుకున్నారు. శిక్షణలో ఉండగానే పరిచయమైన తన బ్యాచ్‌మేట్, ప్రస్తుతం జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి బీరం హరినాథ్‌రెడ్డితో 2014లో శృతకీర్తి విహహం జరిగింది. 2012లో శిక్షణ ప్రారంభం కాగా.. రెండేళ్ల పాటు కొనసాగి 2014లో ముగిసింది. ఆర్నెల్లపాటు ఆదిలాబాద్ బెల్లంపల్లిలో ప్రొబెషనరీ డీఎస్పీగా పనిచేసిన తర్వాత.. తొలి పోస్టింగ్‌గా ఆమె నల్లగొండ జిల్లా స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా నియమితులై ఏడాది కాలంగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. తాను ఉద్యోగం కోసం చదువుతున్న కాలానికే.. తన క్లాస్‌మేట్స్‌లో ఎక్కువ మంది ఉద్యోగాల్లో స్థిరపడడం.. తనతోపాటు ప్రభుత్వ ఉద్యోగాలకు లక్షలాది మంది పోటీ పడుతుండడం.. వంటి కారణాలతో కొన్నిసార్లు ఆలోచనలో కూరుకున్నా.. మొక్కవోని దీక్షతో శ్రమించడం వల్లే ఈరోజు అందరి మిత్రులతో పోలిస్తే తాను మాత్రమే ప్రభుత్వ సర్వీసులో ఉన్నానని సంతోషంగా చెప్తున్నారు. 

ఇష్టపడి చదివితే ఎవరికైనా విజయం సాధ్యమే


చిన్నప్పటి నుంచి నాన్న రాజకీయాల కారణంగా ఇంట్లో కూడా అధికారుల సందడి ఉండేది. అలా ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే ఆలోచన నాకు చిన్నప్పటి నుంచే కలిగింది. ఇంట్లో నుంచి ఒకరు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉండాలనేది నాన్న కోరిక. గ్రూప్-1లో అనుకున్నన్ని మార్కులు రాకపోవడంతో.. ఆర్డీఓ అవకాశం కోల్పోయి నాన్న కోరుకున్న పోలీసు శాఖలో డీఎస్పీగా అవకాశం దక్కింది. ప్రభుత్వం ఉద్యోగం సాధించాలనే నా కోరిక.. పోలీసు శాఖలో ఒకరు ఉండాలనే నాన్న కోరిక.. ఒకేసారి నెరవేరాయి. కాంపిటీటివ్ పరీక్షలను ఎప్పుడూ ఎదుర్కోకున్నా.. గ్రూప్-1 ప్రిపరేషన్ నాకెప్పుడూ కష్టం అనిపించలేదు. ఇష్టపడి చదవడం వల్ల కావొచ్చు. అందరూ అలాగే ఇష్టపడి చదివితే ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. పరిస్థితులకు, పక్క వారిని చూసి అస్సలు భయపడకూడదు. ఇదే డిపార్ట్‌మెంట్‌లో ఇంకా ఉన్నతస్థానం సాధించాలనే లక్ష్యంతో ఇప్పటికీ చదువుతూనే ఉన్నాను. పెళ్లికి ముందు అమ్మ, అన్నయ్య, అక్కల ప్రోత్సాహం ఉంటే.. ఇప్పుడు నా భర్త ప్రతి విషయంలోనూ నన్ను ముందుకు నడిపిస్తున్నారు. 
- శృతకీర్తి, డీఎస్పీ, స్పెషల్ బ్రాంచ్ 

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top