Search This Blog

Monday, February 8, 2016

ఎప్పుడు, ఏది చదవాలి?

పరీక్షల ముందైనా, పరీక్షల సమయంలోనైనా వివిధ పాఠ్యాంశాలను ఆకళింపు చేసుకోవాలంటే శ్రద్ధగా అధ్యయనం చేయాల్సిందే. విద్యార్థులకు కొన్ని సబ్జెక్టులు క్లిష్టంగా; మరికొన్ని ఇష్టంగా అనిపిస్తాయి. వాటిని బట్టి చదివే తీరుతెన్నులను కొంత మార్చుకుంటే మెరుగైన ఫలితాలు తథ్యం!
రగతి గదిలో అధ్యాపకుల బోధన ద్వారా మాత్రమే పాఠ్యాంశాలపై పట్టు రాదు. తరగతి గదిలో, బయటా చేసే కృషిని బట్టి అది సాధ్యమవుతుంది. చదివే విధానాన్ని ఎక్కువ ఉపయోగకరంగా మార్చుకోవాలంటే స్థలం, సమయం ప్రధాన భూమిక పోషిస్తాయంటారు నిపుణులు.
ఎక్కడ, ఎప్పుడు, ఎలా చదివితే మంచిదో తెలుసుకునేముందు ప్రతి ఒక్కరూ దృష్టి (విజువల్‌), శ్రవణ (ఆడిటరీ), స్పర్శ (కైనీస్తటిక్‌) సంబంధ అభ్యసనా శైలుల్లో వారివారి శైలి ఏమిటో తెలుసుకోవాలి. ఇష్టమైన పద్ధతిలో ఏది నేర్చుకున్నా అది ఎక్కువ రోజులు గుర్తుంటుంది. పరీక్షల్లో వాటిని సునాయాసంగా రాయగలుగుతారు. తద్వారా ఆశించిన మార్కులూ ర్యాంకులూ సొంతమవుతాయి.
ఏ చోట?
చదువుకునే స్థలాన్ని మాటిమాటికీ మార్చకపోతే మంచిది. ఇల్లు, కళాశాల వంటి ప్రదేశాల్లో ఓ నిర్దిష్ట స్థలంలో కూర్చుని సన్నద్ధమవాలి. వీలైనంత వరకూ నేలమీద కూర్చుని చదవకపోతేనే మేలు.
ఎదురుగా సొరుగుల బల్ల (టేబుల్‌)తో కుర్చీలో కూర్చుని మీరు సబ్జెక్టును మధిస్తుంటారా? అయితే మీలాంటివారు నేలమీద కూర్చుని అధ్యయనం చేసేవారికన్నా మూడురెట్లు ఎక్కువ సమయం అలసిపోకుండా చదవగలరు. అధ్యయనాలు చెబుతున్నమాట ఇది.
నేలమీద కూర్చుని చదవటం వల్ల ఇబ్బంది ఏమిటంటే... శరీరం బరువు కాళ్ళు, తొడలపై పడి కాళ్ళలో రక్తప్రసరణ సరిగా జరగక తిమ్మిర్లు పట్టవచ్చు. వెన్నుపూస కూడా నిటారుగా ఉండక త్వరగా అలసిపోతాం.
కళ్ళకు ఇబ్బంది లేకుండా ఎక్కువసేపు చదవాలంటే చదివే స్థలంలో కాస్త ఎక్కువ కాంతి లేదా ప్రకాశవంతమైన వెలుతురు ఉండాలి. అది కూడా ఎడమభుజం వెనకవైపు నుంచి (ఎడమచేతి వాటంవారైతే కుడిభుజం వెనకవైపు నుంచి) చదివే పుస్తకంపై వెలుతురు పడేలా కూర్చోవాలి.
మేజాబల్లపై అవసరమైన పుస్తకాలు, కలం, పెన్సిల్‌ వంటి లేఖన సామగ్రి పెట్టుకునే స్థలం ఉండాలి. ముఖ్యంగా ప్రామాణిక నిఘంటువులు, అట్లాస్‌, వీలైతే విజ్ఞాన సర్వస్వం (ఎన్‌సైక్లోపీడియా) ఉండేలా చూసుకోవాలి.
చదివే సబ్జెక్టు చాలా ఇష్టమైనదైతే ఎక్కడైనా చదవగలం. శబ్దాలూ, అరుపులూ, చిన్నపిల్లల అల్లరీ వంటి ఆటంకాలు ఎక్కువగా ఉంటే ఎవరికైనా ఏకాగ్రత దెబ్బతింటుంది.
గది గోడలపై అనవసరమైన చిత్రపటాలు లేకుండా ఉండాలి. లక్ష్యసాధనకు ఉపయోగపడే పరీక్షల సిలబస్‌, ప్రపంచపటం, క్లిష్టమైన ఫార్ములాల వంటి పోస్టర్లు గోడలకు వేలాడదీయటం శ్రేయస్కరం. కొందరు యంత్రవాద్య (ఇన్‌స్ట్రుమెంటల్‌) సంగీతాన్ని చిన్నగా పెట్టుకుని సబ్జెక్టు అధ్యయనానికి ఉపక్రమిస్తారు. వీలైనంతవరకూ అవరోధాలు రాకుండా ఎవరికి వారు సన్నద్ధమవటానికి ఉపయోగపడే వాతావరణాన్ని సృష్టించుకోవాలి.
ఏ సమయంలో?
సబ్జెక్టుల అధ్యయనానికి అందరికీ ఒకే సమయం అనుకూలంగా ఉండదు. అలా ఉండాల్సిన అవసరమూ లేదు. రోజులో ఒక్కొక్కరు ఒక్కో సమయంలో మానసికంగా చురుగ్గా ఉంటారు. ఎవరికి వారు తాము ఎప్పుడు అత్యంత ఉత్సాహంతో ఉంటారో తెలుసుకోవాలి. తెల్లవారుజాము, స్నానానంతరం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి... ఇలా ఎప్పుడు ఎక్కువ ఉల్లాసంగా ఉంటామో తెలుసుకుని, చదువుకు ఉపక్రమించాలి.
ప్రతి ఒక్కరికీ ఓ జీవ గడియారం (బయలాజికల్‌ క్లాక్‌) ఉంటుంది. అంటే ఒక నిర్దిష్ట సమయంలో నిద్ర లేస్తాం, మరో సమయంలో కాలకృత్యాలు తీర్చుకుంటాం. ఇంకో సమయంలో నిద్రపోతాం. ఈ పనులన్నింటికీ శరీరం దానంతట అదే అలవాటుపడివుంటుంది. భారతదేశంలో పాఠకులు ఈ కథనం చదువుతున్న సమయానికి సుదూర పశ్చిమ దేశాల్లో ఉన్నవారిలో కొందరు (అంతర్జాలంలో మీకన్నా ముందే చదివేసి) వారి టైమ్‌ జోన్‌ కారణంగా నిద్రిస్తూ ఉండవచ్చు. దానికనుగుణంగానే వారి జీవగడియారం ఉంటుంది.
వ్యక్తిగత ప్రాధాన్యాలూ, కుటుంబ పరిస్థితులూ జీవన విధానాన్ని బట్టి ఒక్కొక్కరు తమకు అనుకూల సమయంలో పాఠ్యాంశాల సన్నద్ధతకు సమయం కేటాయిస్తారు.
కొందరు కళాశాల నుంచి వచ్చిన వెంటనే పుస్తకాలు తెరవడానికి ఇష్టపడతారు.
కొందరు సాయంత్రం ఏదో ఓ ఆట ఆడిన తర్వాత చదవాలనుకుంటారు.
ఆటలంటే ఇష్టపడేవారు ఆడిన తర్వాత సన్నద్ధమయితేనే మేలు. ఎందుకంటే ఆడలేదనే అసంతృప్తి వెంటాడితే చదివింది మెదడుకెక్కదు.
ఎప్పుడు చదవాలో తెలుసుకోవాలనుకునేవారు రెండు ప్రశ్నలు వేసుకోవాలి. 1) రోజులో ఏ సమయంలో నేను మానసికంగా అత్యంత ఉత్సాహంగా ఉంటాను? 2) ఒకసారి చదవటానికి కూర్చుంటే ఎంత ఎక్కువసేపు నిరాటంకంగా కొనసాగించగలను?
పరీక్షలు సమీపించేవరకూ ఆగి చదవటం ప్రారంభిస్తే ఎవరూ విజేతలు కాలేరు. కేవలం బట్టీ విధానంపై ఆధారపడితే పడే శ్రమంతా వృథానే. ప్రకృతే మనకు ప్రతి పనికీ నిర్దిష్ట సమయం కేటాయించుకోవాలని ప్రేరణనిస్తోంది. ప్రణాళిక వేసుకుని ఏ సమయంలో చేయాల్సిన పనిని ఆ సమయానికే పూర్తిచేయడం అలవాటు చేసుకుంటే అనుకున్న లక్ష్యం చేరుకోవడం చాలా సులభం.
అధ్యయనం ప్రారంభిస్తే ఎంతసేపు చదవాలనేది మీ వయసు, విద్యార్థిగా మీ సామర్థ్యం, చదువుకు సంబంధించిన మీ మంచి అలవాట్లు ఎలా ఉన్నాయనే విషయాలపై ఆధారపడివుంటుంది.
ఈ ప్రశ్నలు వేసుకోండి.
1) రోజులో ఏ సమయంలో నేను మానసికంగా అత్యంత ఉత్సాహంగా ఉంటాను? 
2) ఒకసారి చదవటానికి కూర్చుంటే ఎంత ఎక్కువసేపు నిరాటంకంగా కొనసాగించ గలను?
తెల్లవారుజాము మంచిదే!
పుస్తకాల అధ్యయనానికి తెల్లవారుజాము చాలా మంచిది. ఇది వీలు కాని వారు కంగారుపడాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ మెదడు విశ్రాంతి తీసుకుని ఉంటుంది కాబట్టి చదువును అది సునాయాసంగా స్వీకరించగలుగుతుంది.
పగటితో పోలిస్తే రాత్రిపూట కాలుష్యం ఉండదు. ఉదయం వాతావరణంలో దుమ్ము, ధూళి కణాలు ఎక్కువ. రాత్రి సమయంలో ఇవి నేలను తాకి ఉంటాయి. అందుకనే తెల్లవారుజామున స్వచ్ఛమైన గాలి వీస్తుంది. ఇది మెదడుకు ఎక్కువ ఉపయోగపడుతుంది.
విశ్రాంతి పొందిన శరీరం తెల్లవారుజామున చదివే విషయంలో మెదడుకూ సహకారాన్ని అందిస్తుంది.
ఇన్ని ఉపయుక్త అంశాలున్నందున తెల్లవారుజాము వేళ చదవటానికి మంచిదనడం నిర్వివాదాంశమే. వేకువ వేళ వీలు కాకపోతే చురుకైన ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాలి. అంతేతప్ప నిరాశా నిస్పృహలకు లోను కాకూడదు.

‘సిప్‌’ మెలకువ పాటిద్దాం!
పాఠ్యాంశాల సన్నద్ధతను మరింత ఆహ్లాదకరంగా మార్చడానికి SIP మెలకువ చాలా ఉపయోగపడుతుంది. S అంటే Serious, I అంటే Interesting, P అంటేPleasurable.
మానసికంగా అత్యంత ఉత్సాహంగా ఉండి చదవటానికి కూర్చునే సమయంలో మనలో వంద యూనిట్ల శక్తి ఉందనుకుందాం. అప్పుడు సీరియస్‌గా, కష్టంగా ఉండే సబ్జెక్టు చదవాలి. ఎందుకంటే కష్టమైన విషయాన్ని చురుగ్గా ఉన్నపుడే అర్థం చేసుకోగలం.
ఓ గంట సేపు చదివాక శక్తి అరవై యూనిట్లకు పడిపోయిందనుకుందాం. అపుడు ఆసక్తికరంగా ఉండే సబ్జెక్టు చదవాలి. అలా ఉండే సబ్జెక్టుకు ఆ మాత్రం శక్తి చాలు.
మరో గంట గడిచాక మన శక్తి నలబై యూనిట్లకు పడిపోయిందనుకుందాం. అపుడు సంతోషంగా అనిపించే సబ్జెక్టు, అంటే చదవటానికి ఉల్లాసంగా భావించే సబ్జెక్టు చదవాలి.
ఇది విజేతలు చేసే పని!
కానీ కొందరు SIP మెలకువను వ్యతిరేక దిశలో PIS గా మార్చి వైఫల్యం పొందుతుంటారు. ఇలాంటివారు మానసికంగా అత్యంత ఉత్సాహంగా ఉండి వంద యూనిట్ల శక్తి ఉన్నపుడు సంతోషంగా, ఇష్టంగా ఉండే సబ్జెక్టును చదువుతారు.
వాస్తవానికి చాలా ఇష్టమైన సబ్జెక్టుకు వంద యూనిట్ల శక్తి అవసరం లేదు. ఇది పిచ్చుకపై బ్రహ్మాస్త్రం వేసినట్టు!
ఓ గంటసేపు చదివాక వారి శక్తి అరవై యూనిట్లకు పడిపోయిందనుకుందాం. అప్పుడు ఆసక్తిగా ఉండే సబ్జెక్టు సిద్ధమవుతారు. మరో గంట చదివాక వారి శక్తి నలబై యూనిట్లకు పడిపోతుంది. అప్పుడు సీరియస్‌ సబ్జెక్టు, అంటే వారు ఎక్కువ కష్టంగా భావించేది చదువుతారు. ఇలా చేయటం వల్ల దాన్ని అర్థం చేసుకోవడానికి ఆ నలబై యూనిట్ల శక్తి సరిపోక ఆ సబ్జెక్టు అతి కష్టంగా అనిపిస్తుంది. తద్వారా దానిపై అయిష్టత పెరిగి, ఆసక్తి తగ్గుతుంది. సరిగా చదవలేక మార్కులు తక్కువ తెచ్చుకుంటారు.
అందుకే ‘విజయం సాధించడానికి చేయగలిగిందల్లా చేస్తే లాభం లేదు. చేయవలసిందల్లా చేయాలి’. భిన్నమైన విత్తనాలు నాటడం ద్వారా నేల సారవంతమైనట్లు మన మెదడు కూడా వివిధ రకాల చదివే అలవాట్ల వల్ల చురుకుదనం పొందుతుంది!

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top