తెలంగాణలో కొత్తగా 120 గురుకులాలు
న్యాక్ అర్హత లేని 56 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో వసతులు: ఉప ముఖ్యమంత్రి కడియం
ఈనాడు, హైదరాబాద్: వచ్చే విద్యాసంవత్సరంలో నాణ్యమైన విద్యనందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోనుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. బుధవారం విద్యాశాఖలోని ఆయా విభాగాధిపతులతో బడ్జెట్‌పై సమీక్షించిన అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. తెలంగాణలో కొత్తగా 120 గురుకుల పాఠశాలల ఏర్పాటుకు బడ్జెట్‌లో ప్రతిపాదించబోతున్నామని చెప్పారు. కేజీ టూ పీజీలో భాగంగా రెండోదశ ఆదర్శ పాఠశాలల కింద ఈ గురుకులాలను నెలకొల్పుతామన్నారు. రాష్ట్రంలో 126 ప్రభుత్వ డిగ్రీ కళాశాలుండగా అందులో 70 వరకు న్యాక్ గుర్తింపునకు అర్హత సంపాదించాయని.. మిగతా 56 కళాశాలల్లో మౌలిక వసతులైన భవనాలు, సొంత స్థలాలు లేవని తెలిపారు. ఈ క్రమంలో వాటిల్లో న్యాక్ గ్రేడ్ సాధించేలా వసతులు కల్పించాలని నిర్ణయించామని కడియం పేర్కొన్నారు. జాతీయ అక్షరాస్యత సగటు 73 శాతం ఉండగా తెలంగాణలో అది 66 శాతమే ఉందని.. జాతీయ సగటును దాటేలా అక్షరాస్యత పెంచేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరాన్ని విద్యా సంవత్సరంగా ప్రకటించబోతున్నట్లు కడియం శ్రీహరి తెలిపారు.