పదో తరగతి పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు అనేక కోర్సులు, కెరీర్ మార్గాలను అన్వేషించవచ్చు. ఈ సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం భవిష్యత్తు విజయానికి కీలకం. మీ ఆసక్తులు, నైపుణ్యాలు, లక్ష్యాలను పరిగణనలోకి తీసుకుని, మీకు అనుకూలమైన కోర్సును ఎంచుకోవడం ముఖ్యం.
1. పదో తరగతి తర్వాత అందుబాటులో ఉన్న కోర్సులు.
ఇంటర్మీడియట్
MPC: ఇంజినీరింగ్, డిజైన్, డిఫెన్స్, సైన్స్ రంగాల్లో కెరీర్‌ను కోరుకునే వారికి అనుకూలం.
BiPC: మెడికల్, ఫార్మసీ, అగ్రికల్చర్, ఆయుష్ కోర్సులు, బయోటెక్నాలజీ వంటి రంగాల్లో ఆసక్తి ఉన్నవారికి.
CEC , MEC: కామర్స్, ఎకనామిక్స్, అకౌంటెన్సీ, మేనేజ్‌మెంట్, బ్యాంకింగ్, సీఏ, సీఎస్, బిజినెస్ రంగాల్లో కెరీర్‌ను కోరుకునే వారికి.
HEC: సివిల్స్, గ్రూప్స్, సోషల్ సైన్సెస్, లా, జర్నలిజం వంటి రంగాల్లో ఆసక్తి ఉన్నవారికి.
2. పాలిటెక్నిక్ డిప్లొమా
ఇంజినీరింగ్, టెక్నాలజీ రంగాల్లో మూడేళ్ల డిప్లొమా కోర్సులు. ఈ కోర్సులు పూర్తి చేసిన తర్వాత సంబంధిత రంగాల్లో సూపర్‌వైజర్ స్థాయి ఉద్యోగాలు పొందవచ్చు.
3. ఐటీఐ / ఐటీసీ
ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు సాంకేతిక రంగాల్లో శిక్షణ ఇస్తాయి. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, కంప్యూటర్ ఆపరేటర్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
4. వొకేషనల్ కోర్సులు
క్రాప్ ప్రొడక్షన్, అకౌంటింగ్, బ్యాంకింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులు పూర్తి చేసిన తర్వాత సంబంధిత రంగాల్లో ఉద్యోగాలు పొందవచ్చు.
5. షార్ట్‌టర్మ్ డిప్లొమాలు
స్టెనోగ్రఫీ, ఫైన్ ఆర్ట్స్, మల్టీమీడియా, ఆర్ట్ టీచర్ వంటి కోర్సులు 6 నెలల నుంచి 1 సంవత్సరం కాలపరిమితి గలవు. ఈ కోర్సులు పూర్తి చేసిన తర్వాత సంబంధిత రంగాల్లో ఉద్యోగాలు పొందవచ్చు.
6. ట్రిపుల్ ఐటీ
గ్రామీణ విద్యార్థులకు 6 ఏళ్ల సమీకృత ఇంజినీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
పదో తరగతి మార్కుల ఆధారంగా ప్రవేశం పొందవచ్చు.
కోర్సు ఎంపికలో పరిగణించవలసిన అంశాలు
ఆసక్తి: మీకు ఆసక్తి ఉన్న సబ్జెక్టులు, రంగాలను గుర్తించండి.
నైపుణ్యాలు: మీ బలాలు, నైపుణ్యాలను విశ్లేషించండి.
లక్ష్యాలు: భవిష్యత్తులో మీరు చేరాలనుకునే కెరీర్‌ను నిర్ధారించుకోండి.
సలహాలు: తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కెరీర్ కౌన్సిలర్ల సలహాలు తీసుకోండి.
పరిశీలన: అందుబాటులో ఉన్న అన్ని కోర్సుల గురించి పూర్తి సమాచారం సేకరించండి.
తల్లిదండ్రుల పాత్ర
తల్లిదండ్రులు పిల్లల ఆసక్తులు, నైపుణ్యాలను గుర్తించి, ప్రోత్సహించాలి. వారి ఆశయాలను పిల్లలపై రుద్దకుండా, మార్గదర్శకులుగా ఉండాలి.
మీరు ఈ దశలో సరైన నిర్ణయం తీసుకుంటే, మీ భవిష్యత్తు దిశగా మేలైన అడుగు వేయగలుగుతారు. మీ ఆసక్తులు, నైపుణ్యాలు, లక్ష్యాలను పరిగణనలోకి తీసుకుని, మీకు సరైన మార్గాన్ని ఎంచుకోండి..
----------------------------------------------------------------------------------------------------
పదో తరగతి తర్వాత ఎన్నో కోర్సులు! వీటితో వేల సంఖ్యలో కెరియర్లకు మార్గం సుగమం చేసుకోవచ్చు. ఎంపికలో మాత్రం.. ‘గుంపులో గోవింద’ తీరు సరి కాదు. అందరూ అందులో చేరుతున్నారనో.. ఎవరూ ఇటువైపు రావడం లేదనో.. స్నేహితులు చెప్పారనో.. అమ్మానాన్నల ఆశయమనో.. అవకాశాలు విస్తృతంగా ఉన్నాయనో.. ఓ నిర్ణయానికి రాకూడదు. ఇవేవీ మీకు సరైనవి కాకపోవచ్చు. వీటి ఎంపికలో మీ ముద్ర లేకపోవడమే కారణం. మీ దారి.. మహోన్నతం కావాలంటే నిర్ణయం తీసుకోవాల్సింది మీరే!
ఎవరి మార్గాన్ని వారు నిర్ణయించుకునే అవకాశం పదో తరగతి తర్వాత దక్కుతుంది. ఉన్న వాటిలో గమ్యాన్ని చేర్చేదాన్ని ఎంచుకోవడమే ప్రధానం. ఇందుకు స్వీయ సామర్థ్యాలే కొలమానం. ప్రతి విద్యార్థీ ఎవరికి వారే ప్రత్యేకం. అందువల్ల నైపుణ్యాలు, ఆసక్తులు గుర్తించి, సరైన కోర్సు ఎంచుకుంటే మేటి భవిష్యత్తు దిశగా మొదటి అడుగు పడినట్లే!
మీ గురించి మీ కంటే ఎక్కువగా మరెవరికీ తెలీదు. స్వీయ సమీక్షే కీలకం. ఇందుకోసం మీ సామర్థ్యం, ఆసక్తులను పరిగణనలోకి తీసుకోండి. మీ బలహీనతలేమిటో గుర్తించి, వాటి ప్రకారం పది తర్వాత ఉన్న కోర్సుల జాబితాలో కొన్నింటిని తొలగించండి. మిగిలినవాటిలో మీకు సరిపోయేది ఎంచుకోండి. ఈ క్రమంలో సమగ్రత కొరవడకుండా చూసుకోండి. పది తర్వాత ఉన్న అన్ని కోర్సులూ, మార్గాలపైనా అవగాహన పెంచుకోండి
దారులెన్నో!
పది పూర్తిచేసుకున్నవారి ముందున్న మార్గాలు.. ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ డిప్లొమాలు, ఐటీఐ, వొకేషనల్ కోర్సులు, ఉద్యోగాలు, ప్రత్యేక డిప్లొమాలు. ఇవన్నీ ప్రాధాన్యం ఉన్నవే. అయితే మీకు సరిపోయేవి ఏవో గుర్తించే బాధ్యత మీదే. ఉన్న వాటిలో ఏదో ఒక్కటి మాత్రమే ఎంచుకునే అవకాశం ఉంది. అందువల్ల బాగా ఆలోచించి, విశ్లేషించుకుని నిర్ణయం తీసుకోవాలి.
మ్యాథ్స్ అంటే భయం కాబట్టి బైపీసీ, సైన్స్‌పై ఆసక్తి లేక సీఈసీ.. ఇలా ఎంచుకుంటే రాణించలేరు. ఎందుకంటే.. బైపీసీ తీసుకోవడానికి మ్యాథ్స్ రాకపోవడం కారణం కాకూడదు. సైన్స్ అంశాల్లో పట్టు లేదు కాబట్టి ఆర్ట్స్ కోర్సుల్లో చేరొద్దు. ఏ అంశాల్లో ప్రావీణ్యం ఉందో గుర్తించి, ఆ దిశగా అడుగులేయాలి. ఒక సబ్జెక్టులో ఆసక్తి, ప్రావీణ్యం లేదనే కారణంతో ఇంకోటి వద్దు. ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ అంతిమంగా వ్యక్తిగత ఆసక్తి, అభిరుచులకే పెద్ద పీట వేయాలి. అన్ని కోణాల్లోనూ ఆలోచించి నిర్ణయానికి రావాలి.
పోటీపడాల్సింది మీరే
చదువులో రాణించలేని ఎక్కువమంది విద్యార్థులు చెప్పే ప్రధాన కారణం.. ఫలానా వాళ్ల ఒత్తిడితో ఆసక్తి లేకుండా ఈ కోర్సులో చేరి నష్టపోయానని అనడమే. అందువల్ల.. తెలిసినవాళ్లు చెప్పారనో, బంధువులు సూచించారనో, స్నేహితులతో కలిసి ఉండొచ్చనో, ఎక్కువ సంపాదనకు వీలుందనో, సులువుగా ఉత్తీర్ణత సాధించవచ్చనో, ఎక్కువ మంది చేరుతున్నారనో.. ఇలాంటి కారణాలతో కోర్సు, గ్రూపులను ఎంచుకోవద్దు. చేరిన కోర్సులో రాణించాల్సిన బాధ్యత మీదేనని మర్చిపోవద్దు. అందుకే ఎవరి భవిష్యత్తుని వాళ్లే నిర్ణయించుకుని కెరియర్ సౌధాన్ని నిర్మించుకోవాలి. ఆసక్తులు, బలాలు, ఇష్టాలు, అభిరుచులు, నైపుణ్యాలు, ఆశయాలు సమగ్రంగా విశ్లేషించుకోవాలి.
వ్యక్తిగత అభిరుచి లేకుండా అనుసరిస్తే నష్టపోయేది మనమే. బైపీసీలో చేరిన ఆరు నెలల తర్వాత ‘అయ్యో- ఎంపీసీ తీసుకోవాల్సిందే’ అనుకుంటే ప్రయోజనం ఉండదు. నిర్ణయంలో తప్పు జరిగితే సరిదిద్దుకునే అవకాశం ఉన్నప్పటికీ.. కోరుకున్న కోర్సులో చేరడానికి ఏడాది సమయం వృథా అవుతుంది. అందువల్ల చదువుల విషయంలో నైపుణ్యానికే ప్రాధాన్యం ఇవ్వండి. ఎవరితోనూ పోల్చుకోవద్దు. ఇతరుల సలహాలపై పూర్తిగా ఆధారపడవద్దు. పరీక్షలు రాసి, పోటీ పడాల్సింది మీరేనని మరవొద్దు.
అవసరమైన సమాచారాన్నే ఇతరుల నుంచి సేకరించండి. వాళ్ల అనుభవాలు, ఆలోచనలను మీ విశ్లేషణలో ఉపయోగించుకోండి. అంతిమ నిర్ణయం మాత్రం మీ ఇష్ట ప్రకారమే తీసుకోండి. ఫలానా కోర్సులో చేరతాను. అందుకు బలమైన కారణాలు ఇవీ.. అనే స్పష్టత మీ వద్ద ఉంటే.. మీరు సరైన మార్గంలో ప్రయాణానికి సిద్ధమవుతున్నట్లే లెక్క. ఏ నిర్ణయానికీ రాలేనివాళ్లు గుర్తింపు పొందిన కెరియర్ కౌన్సిలర్ల సహాయాన్నీ తీసుకోవచ్చు.
తల్లిదండ్రుల పాత్ర
పిల్లల సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని తల్లిదండ్రులు వారికి సరిపోయే కోర్సులను సూచించవచ్చు. వ్యక్తిగత ఆశయాలను రుద్దితే భవిష్యత్తులో ఇద్దరికీ ఇబ్బందే. కొన్నిసార్లు తీవ్ర ఒత్తిడితో అనుకోని పరిణామాలూ ఎదుర్కోవాల్సి రావచ్చు. పిల్లలపై వ్యక్తిగత ఆశయాలను రుద్దకూడదు. ఆసక్తి లేకుండా.. తల్లిదండ్రుల ఇష్ట ప్రకారమే చదవాల్సి వస్తే వాళ్లు రాణించలేరు. పెట్టుబడి పెడుతున్నాం కాబట్టి చదవడానికి ఏమైందని అనుకోకూడదు. డాక్టర్ కావాలనుకుని క్యాషియర్‌గా స్థిరపడిన తండ్రి తన ఆశయాన్ని కుమారునిపై రుద్దుతారు. దీంతో మేటి లాయర్‌గా మారి జీవితాన్ని తీర్చిదిద్దుకుని, సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలని గట్టి సంకల్పంతో ఉన్న కుమారుడు అయిష్టంగా బైపీసీలో చేరాల్సి వస్తుంది. చివరికి తండ్రిలాగే అతనూ అసంతృప్తితో ఏదో ఒక ఉద్యోగంతో సరిపెట్టుకోవాల్సి రావచ్చు. అందుకే తల్లిదండ్రులు విద్యార్థుల ఆశయాలకు రెక్కలుగా మారాలి. పిల్లల్లోని సహజ ప్రతిభను గుర్తించి, ఆ దిశగా ప్రోత్సహిస్తే వారు భవిష్యత్తులో అద్భుతంగా రాణించే వీలుంది. వాళ్లకు మార్గదర్శిగా మారితే ఇద్దరి మధ్య ఆత్మీయ అనుబంధమూ బలపడుతుంది.
ఇంటర్‌లో ఉండే వివిధ గ్రూపులు, పాలిటెక్నిక్, ప్రత్యేక డిప్లొమాలు; ఒకేషనల్ విద్య, ఐటీఐ, ఉద్యోగాలు... ఈ కథనాలన్నీ వరుసగా మీ ముందు ఉంచుతాం. వీటిని మీ నిర్ణయాలతో విశ్లేషించుకోవచ్చు!