Search This Blog

Thursday, April 4, 2024

విధి విన్యాసం

🔱 అంతర్యామి 🔱

# విధి విన్యాసం

🍁విధి అనే పదానికి విధాత (బ్రహ్మ) నిర్ణయించినదని
వ్యుత్పత్తి, 'తప్పనిసరి' అనేది సరైన అర్థం. సృష్టి చేయడం బ్రహ్మ పని అని పురాణాలు చెబుతున్నాయి. ఆ సృష్టి అనే బ్రహ్మ రచనలో మనమంతా పాత్రలం. మనం ఒకటి తలిస్తే, దైవం మరొకటి తలుస్తుందనిపిస్తుంది. దానికి కారణం- విధి చేతిలో మనం కీలుబొమ్మలం. విధి అనుకూలిస్తే అంతా సానుకూలమే. విధిలీలలు మానవమాత్రులకు అర్థం కావు. అనుకున్నామని అన్నీ జరగవు. అనుకోలేదని జరిగేది ఏదీ ఆగదు.

🍁 మహామహులకు, దేవుళ్లకు సైతం ఇబ్బందులు తప్పలేదని అనేక సాహితీ ప్రక్రియలు, చరిత్ర, పురాణాల వల్ల తెలుస్తోంది. అయినా విధి విన్యాసాలను ఎవరూ అర్థం చేసుకోలేరు. దాని లీలలు చిత్రంగా ఉంటాయి. విధి వక్రిస్తే ఎంతటివారికైనా పతనం తప్పదు. కోటీశ్వరుణ్ని బికారిగా, బికారిని సంపన్నుడిగా చేసేస్తుంది. సత్యాన్ని అంటిపెట్టుకుని నిజాయతీగా ఉన్న వ్యక్తిని ఎవరూ ఏం చేయలేరు. కాకపోతే కొంతకాలం కష్టాలు, బాధలు, ఇబ్బందులు అనుభవించక తప్పదు. కాని, అంతిమంగా విజయం సాధిస్తారు. హరిశ్చంద్రుడు చక్రవర్తి అయినప్పటికీ, తన తప్పిదం లేకపోయినా అనేక అగచాట్లు, అవమానాలు ఎదుర్కొన్నాడు. అతడితో పాటు భార్య, పుత్రుడు కూడా కష్టాల పాలయ్యారు. ఆ కుటుంబం యావత్తు పవిత్రత, నిజాయతీ, ఆత్మస్థైర్యాలతో ప్రతికూల పరిస్థితులనుప్రతిఘటించగలిగింది. పరిస్థితుల
ప్రాబల్యం వల్ల కొంతకాలం కష్టాలు అనుభవించినా
చివరకు వారంతా విజయాన్ని సాధించారు.

🍁విధి అంటే తప్పకుండా చేయదగినది అనేది సాధారణార్థం. దాని ప్రకారం సృష్టిలోని వారంతా  తమ పాత్రలను తప్పకుండా పోషించవలసిందే.. చిత్రమేమిటంటే అలా పోషిస్తున్న వారంతా తాము బ్రహ్మ చేసిన రచనలో పాత్రధారులమని తెలుసుకోలేరు. అందువల్లనే దుఃఖం, బాధ మొదలైన అనుభూతులను వ్యక్తం చేస్తారు. స్థితప్రజ్ఞ కలవారు మాత్రమే వాటిని తట్టుకుని నిలబడగలుగుతారు.

🍁స్వయంవరంలో దమయంతి నలమహారాజును వరించింది. కలిపురుషుడు ఓర్వలేకపోయాడు. నలుణ్ని ఆవహించి జూదం ఆడించి సర్వం పోగొట్టుకునేలా చేశాడు. తరవాత కాలక్రమేణా కాలం కలిసివచ్చి, విధి అనుకూలించి నలుడు రాజ్యాన్ని, సంపదను పొందగలిగాడు.

🍁ధర్మవర్తనులు, మహావీరులు అయిన పాండవులు ద్రౌపదితో పాటు అజ్ఞాతవాస సమయంలో మారు వేషాలతో విరాటరాజు ఆశ్రయంలో చేరడం, అనేక ఇక్కట్లకు అవమానాలకు గురికావడం అంతా విధి ఆడిన వింత నాటకం. అయితే అదంతా తాత్కాలికమే. చివరికి ధర్మం నెగ్గింది. పాండవులు తమ రాజ్యాన్ని, సంపదను గెలుచుకున్నారు. కర చేయక తప్పనట్లే విధిని అనుభవించక తప్పదు. అది అనివార్యం.

🍁అనుల్లంఘనీయమైన విధిని జయించడం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి ఎంతటివారైనా గర్వంతో మిడిసిపడకూడదు. పొంగిపోవడం, కుంగిపోవడంలాంటివి చేయకూడదు. తోలుబొమ్మలు ఆడించేవాడి చేతుల్లో అన్ని బొమ్మల తాళ్ల చివరలూ ఉన్నట్టే అందరినీ ఆడించే చేయి ఆ పరమాత్మదే అని గ్రహించి మసలుకోవాలి.🙏

⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top