Search This Blog

Monday, February 6, 2023

మేం కొడితే నేరం...? పెద్దయ్యాక అదే మరణం..! పేరెంట్స్ చదవాల్సిన టీచర్ లేఖ!! -


మేం కొడితే నేరం…? పెద్దయ్యాక అదే మరణం..! పేరెంట్స్ చదవాల్సిన టీచర్ లేఖ!!


ts29 teacher

ఇది ఓ టీచర్ ఆవేదన, పిల్లల భవిష్యత్తుపై ఆందోళనతో చేసిన వినతి. తప్పు రా..అంటూ బాల్యంలోనే టీచర్ కొడితే నేరం.. పెద్దయ్యాక అదే తప్పు చేస్తే మరణం. మొక్కై వంగనిదే మానై వంగునా? అనే సామెతను స్ఫురించే విధంగా ఓ అజ్ఞాత టీచర్ చెబుతున్న నీతి కథ ఇది. పిల్లలు సంస్కార హీనులవుతున్నా పట్టించుకోని తల్లిదండ్రులను ఆలోచింపజేసే విధంగా రాసిన ఈ బహిరంగ లేఖ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ టీచర్ విన్నపంలో పిల్లలను తీర్చిదిద్దే లక్ష్యం కనిపిస్తోంది. మంచిని స్వీకరించేవారు ఈ టీచర్ ఆవేదనేమిటో అక్షరం పొల్లు పోకుండా దిగువన చదివి ఆకళింపు చేసుకుంటే సమాజహితాన్ని కోరుకున్నట్లే.

తల్లి దండ్రులకు చేతులు జోడించి ? నమస్కరించి చేసుకుంటున్న విన్నపం ఏమనగా!

అయ్యా,

క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే పాఠశాలల్లో విద్యార్థుల హెయిర్ స్టైల్ పై, వారి నడవడికపై ఎన్నిసార్లు హెచ్చరించినా, వారి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఉపాధ్యాయులు చూస్తూ, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు.

తల్లిదండ్రులకు తమ పిల్లలపై శ్రద్ద, నియంత్రణ లేకపోతే ఇలానే తయారవుతారు.

క్రమశిక్షణ మాటలతో రాదు. కొద్దిపాటి దండన, భయ, భక్తులు ఉంటేనే వస్తుంది.

ts29 hair

పిల్లలకి బడిలో భయంలేదు. ఇంట్లో భయం లేదు. అందుచేతనే సమాజం ఈరోజు భయ, భ్రాంతులకి గురి అవుతున్నది. వాళ్ళే ఈ రోజుల్లో రౌడీలుగా తిరుగుతున్నారు. అభం శుభం తెలియని వాళ్ళని పొట్టన పెట్టుకుంటున్నారు.

గురువుని గౌరవించని సమాజం వినాశకాలానికి గురవుతుంది. ఇది నిజం.

గురువంటే భయం లేదు, గౌరవం లేదు. ఇక చదువు, సంస్కారం ఎట్లా వస్తుంది?

కొట్టొద్దు! తిట్టొద్దు! బడికి రానివాడ్ని ఎందుకు రావట్లేదు అని అడగొద్దు! చదవాలని, హోమ్ వర్క్ అని, కొట్టినా తిట్టినా టీచర్లదే తప్పు! ఒకవేళ కొట్టినచో బడి ముందు ధర్నా! టీచర్ పై దాడి! పోలీస్ కేసు!

6వ తరగతి నుండే కటింగు స్టైలు, చినిగిన జీన్స్ గోడల మీద కూర్చోవడం. వెళ్ళే వారిని, వచ్చే వారిని కామెంట్స్ చేయడం. అరేయ్ సార్ వస్తున్నారురా! అని అంటే, వస్తే రానియ్ అనే పరిస్థితి.

దరిద్రం ఏంటంటే, కొంతమంది తల్లిదండ్రులే మావాడు చదవకున్నా ఏమీ కాదు, మావాడిని మాత్రం కొట్టవద్దు అంటున్నారు.

ఇంకొక విషయం ఏమిటంటే… ఎవరు బాబు నీకు కటింగ్ చేయించింది? అంటే మా నాన్న సార్… అంటున్నారు.

ఇదే అలుసుగా పిల్లలు టీచర్ ఏదన్నా అనగానే పోలీస్ స్టేషన్కు పోతున్నారు.

పెన్ను ఉంటే పుస్తకం ఉండదు, పుస్తకం వుంటే పెన్ను వుండదు. కొనరు, తెచ్చుకోరు. భయం ఉండాలని రెండు దెబ్బలు వేద్దామంటే ఎటునుంచి పోయి ఎటు వస్తాదో అని భయం. ఇవన్నీ చూస్తుంటే పిల్లల కంటే సార్లకే భయం ఎక్కువగా వుంది.

కొట్టకుండా, తిట్టకుండా, భయం లేకుండా చదువు వస్తదా?

భయం లేని కోడి బజారులో గుడ్డు పెట్టిందంట! అలానే ఉంది నేటి పిల్లల వ్యవహారం.

స్కూల్లో తప్పుచేసినా కొట్టకూడదు, తిట్టకూడదు, కనీసం మందలించకూడదు.. ప్రేమతో చెప్పాలట. ఇదెలా సాధ్యమ్?

ts29 pant

మరి సమాజం ఎందుకు అలా చేయదు? మొదటి తప్పేకదా అని ఊరుకుంటుందా?

మంచి నేర్పేవాళ్ళకి (స్కూల్లో) హక్కులుండవు. ప్రవర్తన మార్చుకో అని టీచర్ చిన్నప్పుడే కొడితే నేరం. వాడు పెద్దయ్యాక అదే తప్పు చేస్తే మరణం.

తల్లి దండ్రులకు నా మనవి… పిల్లల్లో మార్పు కేవలం ఉపాధ్యాయులతోనే జరుగుతుంది. ఎక్కడో… ఒకటో అరో… ఒకరిద్దరు టీచర్లు చేసిన తప్పులకు, అందరి ఉపాధ్యాయులకు ఆపాదించవద్దు. 99 శాతం టీచర్లు పిల్లలు బాగుండాలనే వ్యవహరిస్తారు. ఇది యదార్ధం. ఇకనైనా ప్రతీ చిన్న విషయానికి టీచర్లను నిందించవద్దు.

మేం చదువుకునే రోజుల్లో కొంతమంది టీచర్లు మమ్మల్ని దారుణంగా కొట్టేవారు. అయినా ఏనాడు మా పేరెంట్స్ వచ్చి టీచర్లను నిలదీయలేదు. మా బాగు కోసమే అని అనుకునేవారు.

ముందుగా తల్లిదండ్రులు టీచర్ అంటే గౌరవం, భయం ఉండేటట్లు పిల్లలకు మానసిక తర్ఫీదు ఇవ్వాలని మనవి.


CLICK BELOW TO JOIN IN OUR TGARIEA

MOTIVATIONAL VIDEOS

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top