పోటీ పరీక్షలకు ఏకాగ్రత అవసరం
ఎన్ని గంటలు చదివామన్నది ముఖ్యం కాదు
సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి
‘ఆంధ్రజ్యోతి’తో కలెక్టర్ శర్మన్
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): ‘పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు ప్రధానంగా ఏకాగ్రత అవసరం మనుసుపెట్టి చదివితేనే.. మంచి మార్కులొస్తాయి.. ఏళ్ల తరబడి కన్న కలలు సాకారమవుతాయి..’ అని హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ చెప్పారు. యువత పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయన పలు సూచనలు చేయడంతోపాటు, తన అనుభవాలను ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు.
1994లో గ్రూప్-1 వచ్చింది..
మాది ఆదిలాబాద్ జిల్లా జెన్నారం మండలంలోని కలమడుగు గ్రామం. వ్యవసాయ కుటుంబానికి చెందిన నేను చిన్నప్పటి నుంచే చాలా కష్టపడ్డాను. రోజు పాఠశాలకు వెళ్తూనే సెలవు రోజుల్లో నాన్నతో చేసే వ్యవసాయ పనుల్లో పాలుపంచుకున్నాను. ఒకటి నుంచి మూడో తరగతి వరకు కలమడుగులోనే చదివాను. 4 నుంచి 10 వరకు జెన్నారం జిల్లా పరిషత్ స్కూల్‌లో, ఇంటర్మీడియట్ లక్సెట్టిపేట్‌లో, హైదరాబాద్ నిజాం కాలేజీలో డిగ్రీ, ఓయూ క్యాంప్‌సలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాను. చిన్నప్పటి నుంచే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదల ఉండేది. ఇంటర్ చదువుతున్న సమయంలో లెక్చరర్ నారాయణరెడ్డి సార్ నన్ను వెన్నుతట్టి పోత్సహించారు. పరీక్షల్లో మంచి మార్కులు వస్తుండడంతో నీకు మంచి భవిష్యత్ ఉంటుందని.. కలెక్టర్ కావాలని సూచించారు. ఆయన మాటలను స్ఫూర్తిగా తీసుకుని 1994లో గ్రూప్-1 ఉద్యోగాన్ని సాధించాను.
సొంతంగా నోట్స్ తయారు చేసుకున్నాం
డిగ్రీ తర్వాత ఎల్‌ఎల్‌బీ చదివాను. అప్పటి నుంచి సివిల్స్, గ్రూప్-1, గ్రూప్- 2, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇలా ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి పోటీ పరీక్షకు హాజరయ్యాను. ఈ క్రమంలో 1994లో గ్రూప్-1 ఉద్యోగాన్ని సాధించాను. అప్పట్లో పెద్దగా కోచింగ్ సెంటర్లు లేవు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంప్‌సలో నాతోపాటు ఇద్దరు స్నేహితులు కలిసి చదువుకునే వాళ్లం. కరెంట్ ఎఫైర్స్, జనరల్ స్టడీ్‌సకు సంబంధించిన నోట్స్‌ను అకాడమీ పుస్తకాల ద్వారా ఎప్పటికప్పుడు సొంతంగా తయారు చేసుకునే వాళ్లం. రోజూ 6 నుంచి 8 గంటలపాటు చదివే వాళ్లం. చదువుతున్న సమయంలోనే ఎక్కువ విషయాన్ని గుర్తుకు పెట్టుకునే వాళ్లం. నేను ఆర్ట్స్ స్టూడెంట్‌ను కాబట్టి హిస్టరీపై మంచి పట్టు ఉండేది. కరెంట్ ఎఫైర్స్‌పై ఎప్పటికప్పుడు అప్‌డేట్ పొందడంతోపాటు మంచి హ్యాండ్ రైటింగ్ ఉండడం నాకు కలిసి వచ్చింది.
చదివింది గుర్తుకు పెట్టుకోవాలి
ఇప్పుడు కోచింగ్ సెంటర్లు ఎక్కువ. ప్రతి విషయాన్ని గూగూల్ సెర్చ్ చేసి తెలుసుకునే అవకాశం ఉంది. గ్రూప్-1, గ్రూప్-2 రాసే అభ్యర్థులకు ప్రధానం గా ఏకాగ్రత అవసరం. ఎంత చదివామన్నది ముఖ్యం కాదు... చదివిన విషయాన్ని ఎక్కువ గుర్తు పెట్టుకోవడమే ప్రాధానం. సెల్‌ఫోన్లు, టీవీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. బయటి విషయాలు, ఇంటి సమస్యలను అసలే పట్టించుకోవద్దు. ఒక సబ్జెక్టును అరగంట చదివినా.. అందులోని మెయిన్ పాయింట్స్‌ను గుర్తుకు పెట్టుకోవాలి. కోచింగ్ సెంటర్లు ఉన్నాయి కాబట్టి.. నోట్స్ ప్రిపరేషన్‌తో సమయాన్ని వృథా చేసుకోవద్దు. ఏది పడితే అది చదివేయకుండా ప్రణాళికాబద్ధంగా చదవాలి. అలాంటప్పుడే ప్రతి సబ్జెక్ట్‌పై పట్టు లభిస్తోంది. గ్రూప్స్ రాసే వారు రైటింగ్ స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవాలి. దీని ద్వారా పరీక్షల్లో రైటింగ్ ఫ్లో పెరుగుతోంది. సివిల్స్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులు ప్రిలిమినరీ నుంచే ప్రతి అంశంపై అవగాహన పెంచుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే వారికి ప్రతి సబ్జెక్టులో సూక్ష్మస్థాయి పరిశీలన అవసరం.
ఇద్దరమ్మాయిలను సివిల్స్‌కు ప్రిపేర్ చేయిస్తున్నా...
నాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్ద కుమార్తె బీటెక్ పూర్తయింది. చిన్నమ్మాయి బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. మరికొన్ని నెలల్లో నేను ఉద్యోగ విరమణ పొందుతుండడంతో నా ఇద్దరు కుమార్తెలను కూడా ఐఏఎ్‌సలుగా చూడాలనుకుంటున్నా. ఇప్పటికే పెద్దమ్మాయి సివిల్స్‌కు ప్రిపేరవుతోంది. బీటెక్ పూర్తికాగానే చిన్నమ్మాయికి కూడా కోచింగ్ ఇప్పిస్తా. 2005లో గ్రూప్-1 అధికారి నుంచి ఐఏఎ్‌సగా పదోన్నతి లభించింది. కలెక్టర్ ఉద్యోగం ద్వారానే ప్రజలకు నేరుగా సేవలందించే అవకాశం ఉంటుంది. గ్రీవెన్స్ సెల్‌లో వందలాది మంది సమస్యలను పరిష్కరించవచ్చు.
ఇంటర్వ్యూ ధైర్యంగా ఎదుర్కోవాలి
గ్రూప్-1, గ్రూప్-2 రాస్తున్న అభ్యర్థులు లిఖిత పరీక్షతోపాటు ఇంటర్వ్యూను కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి. ఇంటర్వ్యూలో పూర్తిగా వ్యక్తిత్వాన్ని (పర్సనాలిటీ) పరిశీలిస్తారు. ఎడ్యుకేషనల్, ఫ్యామిలీ బ్యాంక్ గ్రౌండ్, అలవాట్లు అడుగుతారు. జాతీయ, అంత ర్జాతీయ సమకాలీన పరిస్థితులపై ప్రశ్నలు సంధిస్తారు. ఇంటర్వ్యూలో ఏమాత్రం తడబడకుండా ఉండాలి. రాని దానిని రాదనే చెప్పాలి. నా ఇంటర్వ్యూలో నలుగురు అధికారులు ఒకరి తర్వాత ఒకరు రకరకాల ప్రశ్నలు అడిగారు. భయం లేకుండా అన్నింటికీ సమాధానాలు ఇచ్చాను. తెలియని దానికి తెలియదనే చెప్పాను.