Search This Blog

Sunday, October 13, 2019

అసలైన ఆభరణం

🌳💚🌳

అసలైన ఆభరణం

ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనల్ని, నలుగురిలో ఉన్నప్పుడు నాలుకను అదుపులో  ఉంచుకోగలిగితే మన జీవితం అదుపు తప్పకుండా ఉంటుంది. నాలుకను అదుపు చేసుకోగల  విద్య తెలిస్తే, అనేక విద్యలు అవలీలగా ఒంటపడతాయి.

నోటిని అదుపులో  పెట్టుకుని అందరితో మర్యాదగా మాట్లాడుతూ, పద్ధతిగా నడుచుకుంటూ ఉంటే  ఎక్కడైనా, ఎప్పుడైనా మంచే జరుగుతుంది.

చెట్టు సారం పండులో వ్యక్తమైనట్లుగా, మనిషి సారం అతడి మాటలో తొంగి చూస్తూ ఉంటుంది. మంగళకరమైన మాట తీరు మనిషి సంస్కారానికి గీటురాయి.

మనిషికి నిజమైన అలంకారం అతడి మాట తీరే. ‘వాగ్భూషణమొక్కటే  మనిషికి సుభూషణం’ అన్నాడు భర్తృహరి.

సంభాషణం మిత భాషణం, హిత భాషణం, స్మిత  భాషణం, ప్రియ భాషణం, పూర్వ భాషణం, సత్య భాషణం అయినప్పుడు- అంతకన్నా భూషణం  మరొకటి లేదు.

‘మితంగా,  హితంగా మాట్లాడాలి. మనిషికి గౌరవం తెచ్చేవి ఇవే’ అనేవారు గాంధీజీ.

ఎప్పుడూ  నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడుతూ ఉండాలి. మధుర భాషణం వల్ల మర్యాద లభిస్తుంది. 

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది కదా. ప్రియంగా మాట్లాడాలి.

ఎదుటి వారిని  ముందుగా మనమే పలకరించడం పూర్వ భాషణం.

రాముడు స్మిత పూర్వ భాషి- మాట కన్నా  ముందు ఆయన చిరునవ్వు ఎదుటివారిని పలకరించేది.

సత్యమే సర్వోన్నతమైంది కనుక నిర్భయంగా సత్యాన్ని పలుకు. ఆ సత్యాన్ని ప్రేమగా, నేర్పుగా చెప్పాలి. మర్యాదగా, హుందాగా మాట్లాడాలి.

ఆలోచించకుండా మాట్లాడటం, గురి చూడకుండా బాణం వేయడం లాంటిది. మాట్లాడిన  తరవాత ఆలోచించాల్సిన అవసరం రాకూడదు. కాబట్టి ఆలోచించి ఆచి తూచి మాట్లాడాలి. 

‘తాను ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు. తాను ఏం మాట్లాడకూడదో  తెలుసుకోగలిగినవాడు వివేకవంతుడు’ అన్నారు స్వామి వివేకానంద.

ఎవరైతే తమ  మాటలవల్ల, చేతల వల్ల ఇతరులకు బాధ కలిగించకుండా ఉంటారో వారే ఉత్తములు.

ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ. ఆదరణ పూర్వకంగా చెప్పే మాటలకు ఆచరణ  ఎక్కువ.

ఆకట్టుకునేలా మాట్లాడటం ఓ కళ. అయితే ఆ మాటలను ఎప్పుడు  మొదలుపెట్టాలో, ఎప్పుడు ఆపాలో తెలియడం మరీ గొప్ప కళ.

మాటలే మంత్రాలు,  చెట్లే ఔషధాలు. మాటలు చాలా పదునైనవి కనుక జాగ్రత్తగా వాడాలి, బలమైనవి కనుక  సున్నితంగా వాడాలి, ఖరీదైనవి కనుక పొదుపుగా వాడాలి.

మాట్లాడటం అందరూ  చేస్తారు. అయితే అందరిలాగా కేవలం నోటితో మాట్లాడితే సరిపోదు. మరింత  ప్రభావాన్వితంగా ఉండాలంటే మనసుతో, శరీరంతో మాట్లాడాలి.

మాటే  సంపదలకు, మానవ సంబంధాలకు మూలం.
మాటే స్నేహితుల్ని సంపాదించి పెడుతుంది, 
శత్రువుల్నీ తయారు చేస్తుంది.

నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు  ధన్యుడు. అలాంటివారికి శత్రువులే ఉండరు.

మాటలు గాయపరచగలవు, అదే గాయాన్ని  నయం చేయనూగలవు. సరైన మాటతీరు- చంపడానికి వచ్చిన శత్రువు మనసునైనా  మార్చగలదు.

మాటల మధ్యలో సందర్భానుసారంగా సామెతలు, లోకోక్తులు వాడితే  పాయసంలో జీడిపప్పులా మరింత మధురంగా, వినసొంపుగా అనిపిస్తుంది. సంభాషణ సరస  చతురత కలిగి ఉండాలి. తిడుతూనే నవ్వించే హాస్య కుశలత కలిగి ఉండాలి.

ఎవరితో, ఎప్పుడు, ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలి. ఈ విషయంలో రామాయణంలో  నాయకుడైన మర్యాదా పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు, సుందరకాండకు నాయకుడైన  సుందరమూర్తి హనుమంతుడు మనకు ఆదర్శం కావాలి.

మనిషికి భావ వ్యక్తీకరణ  గొప్ప ఆస్తి. ఏం చెప్పారనేదానిక న్నా ఎలా చెప్పారనే దాన్నిబట్టి భావప్రసరణ  మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. భావవ్యక్తీకరణ ఎంత గొప్పగా ఉంటే ఫలితం అంత  మహత్తరంగా ఉంటుంది!

🌳💚🌳💚🌳💚🌳💚🌳💚🌳

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top