Search This Blog

Monday, September 24, 2018

ధర్మసూక్ష్మం అంటే ఏమిటి ?*

*🔴ధర్మసూక్ష్మం అంటే ఏమిటి ?*🔴

‘ధర్మో రక్షతి రక్షితః’ అను సూక్తి అందరికీ తెలిసినదే. మనం ధర్మాన్ని రక్షిస్తే... ఆ ధర్మం మనలను రక్షిస్తుంది... అని దాని అర్థం. రక్షించడం అంటే.. కత్తి, కర్ర పట్టుకుని దానికి కాపలా కాయడం కాదు. ఆచరించదగినది ధర్మం. అయితే ఈ ధర్మం ఆచరించే విషయంలో మనకు ఎన్నో సందేహాలు కలుగుతాయి.

‘సత్యమునే పలుకుము...అసత్యము పలుకరాదు’ అనే సూక్తి మనకు తెలిసిందే.
ఈ సూక్తికి కట్టుబడి ఎన్నో త్యాగాలు చేసి పురాణపురుషులుగా ప్రసిద్ధికెక్కిన మహనీయులు మనకు ఎందరో ఉన్నారు.

అయితే...‘ప్రాణ, విత్త, మానభంగమందు బొంకవచ్చు’ అని శుక్రాచార్యునిచేత బలిచక్రవర్తికి చెప్పించాడు పోతనామాత్యుడు. అసలు ఏ మానవుడైనా ఈ మూడు సందర్భాలలోనే అబద్ధం చెప్పడానికి సిద్ధపడతాడు. మరి ఈ సంగతి తెలియకనేనా పోతనంతటివాడు, వ్యాసభగవానుని బాటలో నడిచి అలా పలికాడు?

‘ఆలస్యం అమృతం విషం’ అనే సూక్తితో పాటు ‘నిదానమే ప్రధానం’ అనే మరొక సూక్తి కూడా ఉంది. ఇలాంటి పరస్పర విరుద్ధమైన ధర్మాలు మనకు ఎన్నో ఉన్నాయి. వీటిని ఎలా ఆచరించాలి అనే విషయంలోనే సందేహాలు కలుగుతాయి. అప్పుడే ఆ ధర్మాన్ని సూక్ష్మంగా పరిశీలించాలి. ఇందుకు నిదర్శనంగా ఒక కథ చెప్తాను.

దండకారణ్యంలో ఓ ఋషి ఆశ్రమం కట్టుకుని శిష్యులకు విద్యాదానం చేస్తూ కాలం గడుపుతున్నాడు. ఆ ఋషి ధర్మనిష్ఠాగరిష్ఠుడు...సత్యవాది. అతని ఆశ్రమానికి రెండు ప్రక్కల అరుగులు ఉన్నాయి. ఒకరోజు ఆ ఋషి కుడివైపు అరుగు మీద కూర్చుని శిష్యులకు విద్యాబోధన చేస్తున్నాడు. ఆ సమయంలో ఒక ఆవు ప్రాణ భయంతో ఆర్తనాదం చేస్తూ ఆ ఆశ్రమం ముందునుంచి పరుగెత్తుకుని వెళ్లింది. అది చూసాడు ఆ ఋషి. ఓ వేటగాడు ఆ ఆవును తరుముతున్నాడని గ్రహించాడు. వేటగాడు వచ్చి ‘ఇలా ఆవు వెళ్ళిందా’ అని అడిగితే ‘అబద్ధం ఆడరాదు’ అనే దర్మానికి కట్టుబడి ‘వెళ్ళింది’ అని చెప్పాలి. అలా చెబితే తాను గోహత్యకు కారణభూతుడవుతాడు. ఒక్క క్షణం ఆలోచించి తన శిష్యులతో సహా ఆ అరుగు మీదనుంచి లేచి, ఎడమవైపు అరుగుమీద కూర్చుని, శిష్యులను మౌనంగా ఉండమని చెప్పి విద్యాబోదన చేస్తున్నాడు. కొంతసేపటికి ఓ వేటగాడు అక్కడకు వచ్చి ‘అయ్యా...ఇలా ఏదైనా ఆవు పరుగెత్తుకుని వెళ్లిందా?’ అని ఆ ఋషిని అడిగాడు. గురువుగారు ఏం చెప్తారా అని శిష్యులు ఆత్రంగా చూస్తున్నారు. ఆ ఋషి వేటగాని వంకచూసి ‘నాయనా.. ఈ అరుగు మీద కూర్చుని నా శిష్యులకు పాఠం చెప్తున్నప్పటినుంచి ఏ ఆవు ఇలా వెళ్ళలేదు’ అని బదులిచ్చాడు. వేటగాడు సంతృప్తిచెంది వచ్చిన దారినే వెనుదిరిగి వెళ్లిపోయాడు. ఋషి కుడివైపు అరుగు మీద కూర్చుననప్పుడు ఆవు వెళ్లింది సత్యం. అందుకే ఋషి అరుగు మారి కూర్చున్నాడు. అప్పుడు ఏ ఆవు అటు వెళ్లలేదు. అదీ సత్యమే. అదే చెప్పాడు ఆఋషి. ఋషి అసత్యము ఆడలేదు. ఆవు రక్షించబడింది. ఇదీ కథ.

మంచి పని చేసే విషయంలో ఆలస్యం పనికిరాదు. అప్పుడు ‘ఆలస్యం అమృతం విషం’ అనే సూక్తితని పాటించాలి. చెడు పని చేసే విషయంలో ‘నిదానమే ప్రదానం’ అనే సూక్తిని పాటించాలి. అదే దర్మసూక్ష్మం. ఈ సూక్ష్మాన్ని గ్రహించగలిగినవాడే ధర్మాన్ని రక్షిస్తాడు. ధర్మం చేత రక్షింపబడతాడు.

CLICK BELOW TO JOIN IN OUR TGARIEA

MOTIVATIONAL VIDEOS

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top