Search This Blog

Thursday, May 5, 2016

కేజీ టు పీజీలో భాగమే గురుకుల పాఠశాలలు


 -776 మంది కాంట్రాక్టు టీచర్ల క్రమబద్ధీకరణ
-ప్రతి మండలంలో ఓ గురుకుల పాఠశాల
-సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ ఆదేశం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రభుత్వం అమలు పర్చనున్న కేజీ టు పీజీ ఉచిత విద్యా విధానంలో భాగమే గురుకుల పాఠశాలల ఏర్పాటు అని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఈ పాఠశాలలు అత్యద్భుతమైన, ప్రతిభావంతులైన విద్యార్థులను తెలంగాణ రాష్ర్టానికి అందిస్తాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమం త్రి రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న గురుకుల పాఠశాలలపై సమీక్షించారు. ఎస్సీ పిల్లల కోసం 100 గురుకుల పాఠశాలలు, ఎస్టీ బాలబాలికలకు 50 గురుకుల పాఠశాలలు, 30 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 
kg-to-pg
రెసిడెన్షియల్ పాఠశాలల్లో తొమ్మిదేండ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న 758 మంది ఉపాధ్యాయులను, అడ్‌హాక్ ప్రాతిపదికన పనిచేస్తున్న 18 మంది ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఎక్కువ సంఖ్యలో విద్యార్థులున్న మహబూబ్‌నగర్, వరంగల్, నల్లగొండ, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు ప్రాధాన్యం కల్పించనున్నారు. మూడు నియోజకవర్గాలకు అవకాశాలు లభించే విధంగా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేస్తారు. ప్రతి మండలంలో ఒక గురుకుల పాఠశాల ఏర్పాటు చేసేవిధంగా ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమావేశంలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ నర్సింగ్‌రావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి కే భూపాల్‌రెడ్డి, సాంఘిక సంక్షేమ విద్యాసంస్థల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా, గురుకుల ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించడం పట్ల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు అర్జున్, ప్రధాన కార్యదర్శి కే రామలక్ష్మణ్, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నరేందర్‌రెడ్డి, సీహెచ్ బాల్‌రాజు వేర్వేరు ప్రకటనల్లో హర్షం వ్యక్తం చేశారు.





CLICK BELOW TO JOIN IN OUR TGARIEA

MOTIVATIONAL VIDEOS

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top