తాటి ముంజలు.. ఎండకాలంలో మాత్రమే లభించే అమృత ఫలాలు. చూసేందుకు తెల్లని మంచు ముద్దలా నోట్లో వేసుకుంటే కరిగిపోయే వీటిని ‘ఐస్ యాపిల్' అని పిలుస్తారు.ఎన్నో పోషకాలు, విటమిన్లతో నిండిన ఈ పండ్లు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందిస్తాయి.
తాటి ముంజలు.. ఎండకాలంలో మాత్రమే లభించే అమృత ఫలాలు. చూసేందుకు తెల్లని మంచు ముద్దలా నోట్లో వేసుకుంటే కరిగిపోయే వీటిని ‘ఐస్ యాపిల్’ అని పిలుస్తారు. ఎన్నో పోషకాలు, విటమిన్లతో నిండిన ఈ పండ్లు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందిస్తాయి.
తాటి ముంజల్లో యాంటి ఇన్‌ఫ్లమేటరీ, యాంటి బ్యాక్టీరియల్, యాంటి క్యాన్సర్, యాంటి డయాబెటిక్ లక్షణాలు అధికం. ఇవి.. వివిధ వ్యాధులను దరిచేరనీయకుండా.. మన ఆరోగ్యానికి భరోసా కల్పిస్తాయి. తాటిముంజల్లో నీటి శాతం ఎక్కువ. కాబట్టి, వేసవిలో డీహైడ్రేషన్‌ను సమర్థంగా నివారిస్తాయి. వడదెబ్బకు గురైనవారికి తక్షణ ఉపశమనం అందిస్తాయి. శరీరానికి కావాల్సిన మినరల్స్, చక్కెర పదార్థాలను సమతుల్యం చేస్తాయి. శరీరాన్ని చల్లబరచడంతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ సహాయపడతాయి. ఇందులో అధికంగా లభించే ఫైబర్.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.
ఇక తక్కువ కేలరీలతో కూడిన తాటిముంజలు బరువు తగ్గడంలోనూ సాయపడతాయి. ముంజల్లో లభించే యాంటి ఆక్సిడెంట్లు.. చర్మ ఆరోగ్యానికి భరోసా ఇస్తాయి. ఫైటోకెమికల్స్, ఆంథోసయనిన్ లాంటివి శరీరంలో వివిధ రకాల ట్యూమర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను అభివృద్ధి చేస్తాయి. వీటిని తాటి ముంజలు నిర్మూలిస్తాయని పలు పరిశోధనల్లో తేలింది. అందుకే, ఐస్ యాపిల్స్‌ను రెగ్యులర్‌గా తినేవారు.. వివిధ క్యాన్సర్ల బారిన పడకుండా ఉంటారని పరిశోధకులు చెబుతున్నారు. ఇక ఇందులోని పొటాషియం.. కాలేయ సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది.
ఇక చాలామంది గర్భిణులు మలబద్ధకం, అసిడిటీ సమస్యతో బాధపడుతుంటారు. అలాంటివాళ్లు తాటిముంజలను తీసుకుంటే.. వారి జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. అసిడిటీ, మలబద్ధకం తగ్గుముఖం పడతాయి. ఎండల్లో తిరగడం వల్ల ముఖంపై వచ్చే చిన్నచిన్న మొటిమల్లాంటి పొక్కులను తాటి ముంజలు సమర్థంగా అడ్డుకుంటాయి. అయితే, కొందరు ముంజలపై గోధుమ రంగులో ఉండే పొట్టును తీసేసి.. కేవలం తెల్లటి పదార్థాన్ని మాత్రమే తింటారు. కానీ, ఆ పొట్టులోనే ఎన్నో రకాల పోషకాలుంటాయని, అది ఆరోగ్యానికి మరింత మంచిదంటున్నారు నిపుణులు.