Search This Blog

Wednesday, April 8, 2020

బీఏ.. బీఎస్సీల్లోభిన్నంగా..ప్రత్యేకంగా!ఇంటర్‌ తర్వాత?

🔳బీఏ.. బీఎస్సీల్లోభిన్నంగా..ప్రత్యేకంగా!ఇంటర్‌ తర్వాత?
డిగ్రీ అనగానే సాధారణ, సంప్రదాయ కోర్సులు గుర్తుకొస్తాయి. దాదాపు అన్ని కళాశాలల్లో అవి అందుబాటులో ఉంటాయి. చాలామంది వాటిలో చేరుతుంటారు. కానీ ఆధునిక అవసరాలకు అనుగుణంగా ఈ డిగ్రీల్లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. పలు యూనివర్సిటీలూ, సంస్థలూ స్పెషలైజేషన్లను ప్రవేశపెట్టాయి. రెగ్యులర్‌కి భిన్నంగా డిగ్రీలు చేయాలనుకునేవాళ్లు వీటిని ప్రయత్నించవచ్ఛు ఇవి పూర్తి చేస్తే ప్రత్యేకమైన అవకాశాలనూ అందిపుచ్చుకోవచ్చు.
బీఏ.. బీఎస్సీల్లోభిన్నంగా..ప్రత్యేకంగా!

వృత్తి విద్యకు అయ్యే ఖర్చు ఎక్కువ. నైపుణ్యాలు పెంచుకోకపోతే అత్యాధునిక సాంకేతికత వల్ల ఉద్యోగావకాశాలు తగ్గుతున్నాయి. వచ్చినా నిలదొక్కుకోవటం కష్టం. జీతాలూ అంతంతమాత్రమే. దీంతో ప్రధానంగా సాంకేతిక విద్య ఎంపిక విషయంలో విద్యార్థులు ఆచితూచి అడుగు వేస్తున్నారు. తమ ఆసక్తికి ప్రాధాన్యమిస్తూ భవిష్యత్తులోనూ ఆదరణ ఉండే కెరియర్లను చూసుకుంటున్నారు. వైవిధ్యమైన కెరియర్‌ల వైపు దృష్టి మళ్లిస్తున్నారు. ఇలాంటివారికి డిగ్రీ స్థాయిలో విభిన్న కోర్సులు ఉన్నాయి. నలుగురిలో భిన్నంగా ఉండటమే కాకుండా కెరియర్‌ పరంగానూ మంచి అవకాశాలను అందిస్తుండటం వీటి ప్రత్యేకత. పలు విద్యాసంస్థలూ ప్రస్తుత మార్కెట్‌ ధోరణులు, అవసరాలకు అనుగుణంగా బీఎస్సీ, బీఏ కోర్సులను నవీకరిస్త్తున్నాయి.

బీఎస్‌సీలో..

గేమింగ్‌: యానిమేషన్‌, మల్టీమీడియా కోర్సుగా దీన్ని చెప్పొచ్ఛు గేమ్‌ ఆర్ట్‌ డిజైన్‌, ప్రొడక్షన్‌ మెథడాలజీ, ఇతర సంబంధిత అంశాలను కోర్సులో భాగంగా చదువుకుంటారు. మేథ్స్‌, ఫిజిక్స్‌, అల్గారిథమ్‌ అంశాలూ దీనిలో భాగం. కోర్సు చేసినవారికి ప్లే స్టేషన్‌, పీసీ, ఆన్‌లైన్‌ వెబ్‌, మొబైల్‌ గేమ్స్‌ విభాగాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. సాధారణంగా ఇంటర్‌లో ఏ గ్రూపు వారైనా చేరొచ్ఛు చాలాకొద్ది సంస్థలు మాత్రం ఎంపీసీ పూర్తిచేసినవారికే అవకాశం ఇస్తున్నాయి.

క్లినికల్‌ న్యూట్రిషన్‌ అండ్‌ డైటెటిక్స్‌: ఆహారం, వ్యక్తులు, సైన్స్‌, మెడిసిన్‌ అంశాలపై ఆసక్తి ఉన్నవారి కోసం రూపొందిన కోర్సు. ఇది వ్యక్తుల శరీరం, ఆహారానికి మధ్య ఉన్న సంబంధాన్ని అధ్యయనం చేస్తుంది. సమాజంలో ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామాలపై చైతన్యం ఎక్కువవుతూ సంబంధిత నిపుణుల అవసరం పెరిగిపోతోంది. వీరు వ్యక్తులకు ఆరోగ్యకరమైన అప్రమత్తత, జబ్బుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తారు. కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ఫుడ్‌సైన్స్‌, టెక్నాలజీ, డెయిరీ టెెక్నాలజీ, పాలిమర్‌ కెమిస్ట్రీ మొదలైనవాటిని కోర్సులో భాగంగా చదువుతారు. ఇంటర్‌లో బైపీసీ చదివినవారు ఈ కోర్సుకు అర్హులు.

డేటా సైన్స్‌ అండ్‌ అనలిటిక్స్‌: ఇదో మల్టీ డిసిప్లినరీ విభాగం. డేటా సైన్స్‌లో స్టాటిస్టిక్స్‌, మేథమేటిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అంశాలుంటాయి. వివిధ విభాగాల్లో ఎదురయ్యే సవాళ్ల, సమస్యల పరిష్కారానికి దీన్ని ఉపయోగిస్తారు. డేటా అనలిటిక్స్‌, డేటా సైన్స్‌లో భాగమే. డేటా సైంటిస్టులు ముడి సమాచారం నుంచి వివిధ టెక్నిక్‌లు, సాఫ్ట్‌వేర్‌ల సాయంతో ఉపయోగకరమైనదాన్ని వెలికి తీస్తారు. దీని ద్వారా హెల్త్‌కేర్‌, గవర్నెన్స్‌, మార్కెటింగ్‌, ఎకనామిక్స్‌, ఫైనాన్స్‌ మొదలైన సమాచార ఆధారిత రంగాల్లో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. సెమిస్టర్‌ విధానం ఉంటుంది. ఇంటర్‌లో ఎంపీసీ/ పన్నెండో తరగతిలో స్టాటిస్టిక్స్‌ చదివినవారు అర్హులు.

ఫోరెన్సిక్‌ సైన్స్‌: నేర పరిశోధనలో శాస్త్రీయ పద్ధతులూ, టెక్నిక్‌లను ఉపయోగించడమే ఫోరెన్సిక్‌ సైన్స్‌. దీని పరిధి విస్తృతం. చాలా విభాగాలుంటాయి. నేర ప్రదేశాన్ని విశ్లేషించడం, అధ్యయనం చేయడం, ఆధారాలను సేకరించి లేబుల్‌ చేయడం, వాటిని సురక్షితంగా ఉంచడం వంటివి వీరి పనిలో భాగం. దీనిలో తరగతి గది బోధనతోపాటు ప్రాక్టికల్‌ శిక్షణకూ సమ ప్రాధాన్యం ఉంటుంది. కోర్సులో భాగంగా ఫోరెన్సిక్‌ పాథాలజీ, సైకియాట్రీ, సైకాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, ఒడంటాలజీ వంటి అంశాలను చదువుతారు. సెమిస్టర్‌ విధానం ఉంటుంది. సైన్స్‌ విభాగంలో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసినవారు దీనికి అర్హులు.

హోటల్‌ మేనేజ్‌మెంట్‌/ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌: ఆతిథ్యరంగం సేవకు సంబంధించినది. వినియోగదారులకు సంతృప్తి కలిగించడం, వారు కోరుకున్న విధంగా సేవలను అందించడంపైనే దీని ప్రగతి ఆధారపడి ఉంటుంది. ఈవెంట్లను ప్లాన్‌ చేయడం, లాడ్జింగ్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌, ఆహారంతోపాటు టూర్‌ ప్లానింగ్‌ వంటివీ ఇందులో భాగం. ఫుడ్‌, బెవరేజెస్‌ సర్వీస్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌, ఫ్రంట్‌ ఆఫీస్‌ ఆపరేషన్‌, అకౌంటింగ్‌ మొదలైన అంశాలపై దృష్టిసారిస్తారు. కోర్సుల్లో భాగంగా హ్యూమన్‌ రిసోర్సెస్‌, బిజినెస్‌, కస్టమర్‌ సర్వీస్‌ మొదలైన అంశాలపై శిక్షణనిస్తారు. సెమిస్టర్‌ విధానం ఉంటుంది. కొన్ని సంస్థలు నాలుగో సెమిస్టర్‌లో స్పెషలైజేషన్‌ను ఎంచుకునే వీలును కలిగిస్తున్నాయి. ఏదైనా గ్రూపులో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసినవారు అర్హులు.

ఇంకా.. ఆడియాలజీ అండ్‌ స్పీచ్‌థెరపీ, ఫిలిం మేకింగ్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, ఫైర్‌ సేఫ్టీ అండ్‌ హజార్డ్‌ మేనేజ్‌మెంట్‌, హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌, ట్రావెల్‌ అండ్‌ టూరిజం, మెడికల్‌ బయోకెమిస్ట్రీ, అగ్రికల్చర్‌ కెమిస్ట్రీ అండ్‌ సాయిల్‌ సైన్స్‌, జియోసైన్స్‌, ఫార్మ్‌సైన్స్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌, అగ్రో కెమికల్‌ అండ్‌ పెస్ట్‌ కంట్రోల్‌, క్యాటరింగ్‌ మేనేజ్‌మెంట్‌, జెనెటిక్స్‌ అండ్‌ ప్లాంట్‌ బ్రీడింగ్‌, టెక్స్‌టైల్‌ అండ్‌ క్లోదింగ్‌ మొదలైన కోర్సులూ ఉన్నాయి.

క్రిమినాలజీ

బీఏ.. బీఎస్సీల్లోభిన్నంగా..ప్రత్యేకంగా!

సమాజంలోని వివిధ నేరాలను తగ్గించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలూ మొదలైనవి అధ్యయనం చేసే శాస్త్రమిది. దీనికి సోషియాలజీ, బిహేవియరల్‌ సైన్సులతో దగ్గరి సంబంధం ఉంటుంది. నేరం తీరు, దాని లోతుపాతులు, అది జరగడానికి దారి తీసిన పరిస్థితులు, జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదలైనవాటిని కోర్సులో భాగంగా తెలుసుకుంటారు. క్రిమినల్‌ సైకాలజీపైనా అవగాహన తెచ్చుకుంటారు. ఇంటర్‌ పూర్తిచేసిన వారెవరైనా ఈ కోర్సులో చేరే అవకాశముంది.

సైబర్‌ సెక్యూరిటీ

ఐటీ విభాగంలో అతిముఖ్యమైన విభాగమిది. కంప్యూటర్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌, నెట్‌వర్క్స్‌, డేటాలపై జరిగే సైబర్‌ దాడులను రక్షించడం సంబంధిత నిపుణుల పని. ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్‌, సున్నితమైన డేటా అంశాలతో పనిచేసే ప్రతి రంగంలో వీరి అవసరం ఉంటుంది. క్రిప్టోథెరపీ, నెట్‌వర్క్‌ సెక్యూరిటీ, అథెంటికేషన్‌, యాక్సెస్‌ కంట్రోల్‌ మెకానిజమ్స్‌, వైర్‌లెస్‌ నెట్‌వర్క్స్‌ వల్నరబిలిటీస్‌ అండ్‌ సెక్యూరిటీ, కంప్యూటర్‌ ఫోరెన్సిక్స్‌, సైబర్‌ సెక్యూరిటీ లీగల్‌ ఆస్పెక్ట్స్‌ మొదలైనవాటిని కోర్సులో భాగంగా నేర్చుకుంటారు. ఇంటర్‌లో ఎంపీసీ చదివినవారు దీనికి అర్హులు.

బీఏలో..

కలినరీ ఆర్ట్స్‌: పాకశాస్త్రానికి (కుకింగ్‌) సంబంధించిన అంశాల అధ్యయనమిది. ఆహార తయారీ, చూడముచ్చటగా అమర్చటం, వడ్డన మొదలైనవన్నీ ఇందులో భాగమే. ఒకరకంగా పెద్ద హోటళ్లు, రిసార్టులు, రెస్టారెంట్లు మొదలైనవాటిల్లో ప్రొఫెషనల్‌ చఫె్‌ కావడానికి అవసరమైన నైపుణ్యాలను ఇందులో నేర్పుతారు. కలినరీ రంగంలో అవసరమైన టెక్నికల్‌, ఆపరేషనల్‌, మేనేజీరియల్‌ నైపుణ్యాలకు కోర్సులో చోటిస్తారు. ఏదైనా గ్రూపుతో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసినవారు ఈ కోర్సు చదవడానికి అర్హులు. సెమిస్టర్‌ విధానం ఉంటుంది.

పబ్లిక్‌ రిలేషన్స్‌: నాణ్యమైన సేవలందించే ప్రతి సంస్థకూ పేరు ప్రతిష్ఠలుంటాయి. వీరికి పౌర సంబంధ అధికారుల (పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్స్‌) అవసరం ఉంటుంది. అంతేకాకుండా సమాజంలోని ప్రముఖ వ్యక్తులకూ వీరి అవసరం ఉంటుంది. వినియోగదారుల, ప్రజల అవసరాలను గమనించడం, వీరికీ తమ సంస్థకూ మధ్యవర్తిగా ఉండటం, సంస్థ పరపతిని కాపాడటం వీరి విధి. ఇందులో భాగంగా పబ్లిక్‌ స్పీకింగ్‌, స్పీచ్‌/ స్క్రిప్ట్‌లు/ ప్రపోజల్స్‌ను రాయడం వంటివి చేస్తుంటారు. ఇంటర్మీడియట్‌ ఏ గ్రూపు వారైనా దీన్ని ఎంచుకోవడానికి అర్హులే.

రూరల్‌ డెవలప్‌మెంట్‌

బీఏ.. బీఎస్సీల్లోభిన్నంగా..ప్రత్యేకంగా!

భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే అంశాల్లో గ్రామీణాభివృద్ధి ఒకటి. నాన్‌ అర్బన్‌, గ్రామీణ ప్రాంతాలు, రిమోట్‌ ప్రదేశాల్లో నివసించే వారి జీవన విధానాల అభివృద్ధికి తీసుకునే చర్యలు, చేసే ఆలోచనలను దీనిలో తెలుసుకుంటారు. సంబంధిత నిపుణులు గ్రామీణులకు అభివృద్ధి విధానంలో తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కలిగిస్తారు. అందుకు సంబంధించిన ప్రోగ్రామ్‌లు, టెక్నిక్‌లను రూపొందిస్తారు. ఏదైనా గ్రూపులో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసినవారు అర్హులు.

సోషల్‌ వర్క్‌: సమాజంపై శ్రద్ధ, దాని అభివృద్ధికి చేతనైనంత సాయం చేయాలనుకునేవారు దీన్ని ఎంచుకోవచ్ఛు థియరీ, ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌లతో కూడిన ప్రొఫెషనల్‌ కోర్సు ఇది. ప్రజల జీవితాలను అభివృద్ధి చేయడం, వారి సమస్యలు, వ్యాధుల నిర్మూలన, ఉద్యోగ కల్పన మొదలైనవాటి విషయంలో సాయం చేయడం దీనిలో భాగం. ఇంటర్మీడియట్‌ ఏ గ్రూపు వారైనా దీన్ని చదవడానికి అర్హులే.

ఇంటీరియర్‌ డిజైనింగ్‌: నివాస గృహాలు.. కార్యాలయాలు.. పాఠశాలలు.. ఇలా దేన్నైనా అందంగా, అందుబాటులో ఉన్న స్థలం గరిష్ఠంగా సద్వినియోగమయ్యే విధంగానూ, ఆకర్షణీయంగానూ మార్చేయడం ఇంటీరియర్‌ డిజైనర్ల పని. దీనిపై ఆసక్తి ఉన్నవారు ఈ కోర్సును ఎంచుకోవచ్ఛు స్థలానికి తగ్గట్టుగా డిజైన్‌, అందుకయ్యే బడ్జెట్‌ను రూపొందించడం వంటివి వీరి పనిలో భాగం. ఇంటర్మీడియట్‌ ఏ గ్రూపు వారైనా దీన్ని చదవొచ్చు.

ఫైన్‌ ఆర్ట్స్‌: లలిత కళల పట్ల ఆసక్తి ఉన్నవారు దీన్ని ఎంచుకోవచ్ఛు పెయింటింగ్‌, ఆర్కిటెక్చర్‌, యానిమేషన్‌, అప్లయిడ్‌ ఆర్ట్స్‌, సంగీతం, శిల్పం మొదలైవన్నీ ఇందులో భాగం. మొదటి ఏడాదిలో అన్ని విభాగాలకూ సంబంధించి ప్రాథమిక సమాచారాన్ని బోధిస్తారు. డ్రాయింగ్‌, కలర్‌, క్లే మోడలింగ్‌, ప్రింటింగ్‌, వివిధ మెటీరియళ్లు, టూల్స్‌ మొదలైనవన్నీ కోర్సులో భాగంగా ఉంటాయి. మిగిలిన రెండేళ్లలో విద్యార్థి ఎంచుకున్న స్పెషలైజేషన్‌పై బోధన ఉంటుంది. సెమిస్టర్‌ విధానం ఉంటుంది. ఇంటర్మీడియట్‌ ఏ గ్రూపు వారైనా దీనిలో ప్రవేశానికి అర్హులే.


ఇంకా.. మాస్‌ కమ్యూనికేషన్‌, ఒకేషనల్‌ స్టడీస్‌, ఓరియంటల్‌ కల్చర్‌, ఫిలిం స్టడీస్‌, డిఫెన్స్‌ స్టడీస్‌, టూరిజం, ఫిలాసఫీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, అడ్వర్టైజింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, డెవలప్‌మెంటల్‌ స్టడీస్‌, మీడియా మేనేజ్‌మెంట్‌, జాగ్రఫీ, సైకాలజీ, పొలిటికల్‌ సైన్స్‌, మ్యూజిక్‌ మొదలైనవి బీఏ కాంబినేషన్‌లో లభ్యమవుతున్నాయి.

ఎక్కడెక్కడ?


ఉస్మానియా, ఆంధ్రా యూనివర్సిటీలు సహా పలు ప్రధాన విశ్వవిద్యాలయాలు చాలా వరకు బీఏ, బీఎస్సీ కోర్సులను ప్రత్యేక సబ్జెక్టులతో నిర్వహిస్తున్నాయి. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌, ఇండియన్‌ కలినరీ ఇన్‌స్టిట్యూట్‌ వంటి ప్రత్యేక సంస్థలూ ఈ స్పెషలైజేషన్లతో కొన్ని రకాల డిగ్రీలను అందిస్తున్నాయి. యూనివర్సిటీ ఆఫ్‌ మద్రాస్‌, ఇగ్నో తదితర సంస్థల్లో దూరవిద్యలోనూ కొన్ని కోర్సులు చేయవచ్చు.



TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top