Search This Blog

Thursday, March 7, 2019

రిటర్న్‌ల దాఖలుకు ఈ పత్రాలన్నీ కీలకం*

*📚✍రిటర్న్‌ల దాఖలుకు ఈ పత్రాలన్నీ కీలకం*

*04-03-2019 00:24:22*

*🔺మరి కొద్ది రోజుల్లో పన్ను రిటర్న్‌లు దాఖలు చేయాల్సిన సమయం ఇది. మరి రిటర్న్‌లు దాఖలు చేయడం, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సత్వర ప్రాసెసింగ్‌ కోసం ఏయే పత్రాలు సిద్ధం చేసుకోవాలో వివరిస్తున్నారు బ్యాంక్‌ బజార్‌ సీఈఓ అదిల్‌ షెట్టి.*

🌻మరికొద్ది వారాల్లో పన్ను రిటర్న్‌ల దాఖలు కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి. రిటర్న్‌లు దాఖలు చేసే సమయంలో అసెసీలు కొన్ని పత్రాలు తప్పనిసరిగా సిద్ధం చేసుకోవాలి. ఆ పత్రాలున్నట్టయితే పన్ను రిటర్న్‌లు దాఖలు చేయడం, వాటి ప్రాసెసింగ్‌ కార్యకలాపాలు సత్వరం ముగిసి రావలసిన రిఫండ్లు కూడా త్వరగా చేతికందుతాయి.

*♦ఫారం 16*
ఈ పత్రాన్ని మనం ఉద్యోగం చేసే కంపెనీల యజమానులు మనకి అందిస్తారు. ఇందులో ఏ పద్దు కింద ఉద్యోగికి ఎంత మొత్తం ఇచ్చారు, సదరు ఉద్యోగి చెల్లించాల్సిన పన్నును వేతనం నుంచి ఎంత మినహాయించారు వంటి వివరాలన్నీ పొందుపరుస్తారు. అంటే మీరు ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని దాటినట్టయితే కంపెనీయే మీకు చెల్లించే వేతనం నుంచి పన్ను మినహాయించి ఆదాయపు పన్ను శాఖకు చెల్లించడం ద్వారా మీ పన్నుచెల్లింపు బాధ్యతను నెరవేరుస్తుంది. చట్టప్రకారం ఏ కంపెనీ అయినా ఈ బాధ్యత తీసుకోవడం తప్పనిసరి.

*♦ఫారం 16లో మూడు భాగాలు*
ఫారం 16ఎ, 16బి, 16సి పేరిట ఫారం 16లో మూడు భాగాలుంటాయి.
*▪16ఎ :* వేతనంకాకుండా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు లేదా బీమా కమిషన్ల రూపంలో అందిన వడ్డీ ఆదాయాలపై టిడిఎస్‌ మినహాయింపు వివరాలుంటాయి.
*▪16బి :* వ్యవసాయం మినహా ఇతర స్థిరాస్తుల విక్రయంపై మూల స్థానంలోనే పన్ను మినహాయింపు వివరాలందిస్తుంది.
*▪16సి :* భూమి లీజుపై భూ యజమానులకు చెల్లించే అద్దెపై టిడిఎస్‌ వివరాలు ఇందులో ఉంటాయి.

*♦ఫారం 26 ఏఎస్‌*
ఇది ఏడాదిలో పన్ను చెల్లింపులకు సంబంధించిన కన్సాలిడేటెడ్‌ ప్రకటన. మీ ఆదాయం నుంచి మీ కంపెనీ యాజమాన్యం, బ్యాంకులు మినహాయించిన పన్నులు, చెల్లించిన అడ్వాన్స్‌ టాక్స్‌లకు సంబంధించిన వివరాలన్నీ ఇందులో ఉంటాయి.

*♦వేతనం స్లిప్‌లు*
మీకు వేతనంలో భాగంగా ఇంటి అద్దె అలవెన్స్‌ (హెచ్‌ఆర్‌ఏ), డిఏ ఎంత చెల్లించారు, స్టాండర్డ్‌ డిడక్షన్ల మినహాయింపు వంటి వివరాలన్నీ వీటిలో ఉంటాయి. మీ వేతనంపై మీ పన్ను భారం ఎంత అనేది మదింపు చేసుకోవడానికి ఈ వివరాలన్నీ కీలకం. అలాగే ఫారం 16 లేకపోయిన సందర్భాల్లో వేతన వివరాలన్నీ ఈ స్లిప్‌లు అందిస్తాయి.

*♦బ్యాంకులు, పోస్టాఫీసుల నుంచి వడ్డీ సర్టిఫికెట్లు*
వివిధ పొదుపు ఖాతాలు, ఎఫ్‌డీలు, పోస్టాఫీసు పొదుపు ఖాతాలు, ఆర్‌డిల ద్వారా మీకు అందించిన వడ్డీకి సంబంధించిన సర్టిఫికెట్‌ ఇది. ఇతర మార్గాల్లో అందిన ఆదాయం విభాగంలో ఇవి పొందుపరచాల్సి ఉంటుంది. వీటన్నింటి మీద కూడా పన్ను పడుతుంది.

*♦80డి, 80యు సెక్షన్‌ మినహాయింపు ఆధారాలు*
మెడికల్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం, విద్యా రుణాలపై చెల్లించిన వడ్డీకి సంబంధించిన వివరాలను తెలిపే పత్రాలివి.

*♦ఇంటి రుణం వివరాల స్టేట్‌మెంట్‌*
ఇంటి రుణంపై ప్రిన్సిపల్‌, వడ్డీ చెల్లింపులకు సంబంధించిన వివరాలు ఇందులో ఉంటాయి. మీకు రుణం ఇచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఈ స్టేట్‌మెంట్‌ అందజేస్తాయి. 80సీ కింద ఏడాదిలో ప్రిన్సిపల్‌ చెల్లింపుపై గరిష్ఠంగా రూ.1.5 లక్షలు, సెక్షన్‌ 24 కింద స్వయంగా నివాసం ఉంటున్న ఇంటికి తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లింపుపై గరిష్ఠంగా రూ.2 లక్షల మినహాయింపులను క్లెయిమ్‌ చేసుకోవచ్చు. అద్దెకిచ్చిన ఇంటిపై మాత్రం వడ్డీకి పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుంది. ఇవి కాకుండా తొలిసారిగా ఇల్లు కొనుగోలు చేసిన వారు 80ఈఈఈ సెక్షన్‌ కింద రూ.50 వేల వరకు గరిష్ఠంగా అదనపు మినహాయింపు పొందవచ్చు.

*♦పన్ను ఆదా పెట్టుబడులు / వ్యయాల ఆధారాలు*
80సీ, 80సీసీసీ, 80సీసీడీ (1) కింద పన్ను మినహాయింపు అవకాశం గల పెట్టుబడులు, వ్యయాలకు సంబంధించిన ఆధారాలు సేకరించుకోవడం కూడా అవసరం. వీటి ద్వారా పన్ను రూపంలో మీరు కోల్పోయే సొమ్ములో కొంత ఆదా అవుతుం ది. ఈపీఎఫ్‌, ఎన్‌పీఎస్‌, ఈఎల్‌ఎ్‌సఎస్‌, పీపీఎఫ్‌ వంటివి ఇందులో ఉంటాయి. ఐటి రిటర్న్‌ దాఖలుకు ఈ ఆధారాలు అవసరం.

*♦అడ్వాన్స్‌ టాక్స్‌ చెల్లింపు రసీదు*
చలాన్‌ 280 ద్వారా స్వయంగా మదింపు చేసుకున్న పరిధిలో మీరు పన్ను చెల్లించినట్టయితే దానికి సంబంధించిన ఆధారం ఇది. ఇందులో రసీదుపై ఉండే చలాన్‌ గుర్తింపు నంబర్‌ (సిఐఎన్‌), మీరు పన్ను ఎంత చెల్లించారు వంటి వివరాలుంటాయి.

*♦ఆధార్‌, పాన్‌ కార్డులు*
ఐటి రిటర్న్‌ దాఖలుకు ఆధార్‌ తప్పనిసరి. అలాగే పాన్‌ మీ ఆదాయపు పన్ను గుర్తింపు నంబర్‌గా ఉంటుంది. మ్యూచువల్‌ ఫండ్‌లు, ఆస్తుల విక్రయం ద్వారా మీకు వచ్చే ఆదాయాలను పాన్‌ అనుసంధానం చేస్తుంది. రిటర్న్‌ దాఖలు చేసేందుకు ముందు ఆధార్‌, పాన్‌ నంబర్లు అనుసంధానం చేయడం తప్పనిసరి.

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top